నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆనాడు కాంగ్రెస్ దొరలతో పోరాడామనీ, నేడు బీజేపీ దొరలతో పోరాడుతున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కే.టీ.రామారావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వివిధ పార్టీల నుంచి నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఎక్కడా గొడవలు జరగలేదనీ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు పెద్ద పీట వేస్తామన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నవని తెలిపారు. రాహుల్ గాంధీ తాత తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపినందున 56 ఏండ్లు గోస పడ్డదని వ్యాఖ్యానించారు. అదే రాహుల్ గాంధీ నాయనమ్మ కారణంగా వందల మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. ఢిల్లీ దొరల కారణంగా వేల మంది బలిదానం చేసుకున్నారన్నారు. అనివార్యమయ్యాకే తెలంగాణ ఇస్తామని ప్రకటన చేశారని చెప్పారు. ఢిల్లీ అహంకారానికి తలవంచేది, దించేది లేదని స్పష్టం చేశారు. ఓటు కు నోటుకు దొంగను పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.