సున్నితమైన ప్రేమ, స్నేహం అనే అంశాలతో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ హాస్యభరితంగా తెరకెక్కించిన చిత్రం ‘డంకీ’. షారుఖ్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణీ కాంబోలో మొదటి సారిగా సినిమా వస్తుండటంలో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. గురువారం షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ‘డంకీ’ టీజర్‌ను విడుదల చేశారు. విదేశాలకు వెళ్లాలనే నలుగురు స్నేహితుల కల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ క్రమంలో ఆ నలుగురికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. యదార్థ సంఘటనల ఆధారంగా తీసుకున్న ఈ కథలో ప్రేమ, స్నేహబంధాల గొప్పదనం చాటి చెప్పేలా ఉండబోతోంది. బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ వంటి వారి పాత్రలను పరిచయం చేశారు. ఈ క్రిస్మస్‌కు అందరి మనసులు గెలుచుకునేందుకు ‘డంకీ’ రాబోతోంది. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కుమార్ హిరాణీ ప్రజెంటేషన్ బ్యానర్లపై సంయుక్తంగా రాబోతున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరాణీ, గౌరీ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.