లంకకు నిప్పంటించారు

Sri Lanka with Set on fire– నిప్పులు చెరిగిన షమి, సిరాజ్‌
–  శ్రీలంక 55 ఆలౌట్‌

– 302 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు
– ఏడో విజయంతో సెమీస్‌లో అడుగు
– రాణించిన కోహ్లి, గిల్‌, అయ్యర్‌
– ఐసీసీ 2023 ప్రపంచకప్‌
భారత పేసర్లు శ్రీలంకకు మళ్లీ నిప్పంటించారు!. కొత్త బంతితో సిరాజ్‌, బుమ్రా, షమి నిప్పులు చెరిగారు. సిరాజ్‌, బుమ్రా దెబ్బకు శ్రీలంక 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కొట్టుమిట్టాడగా.. షమి ఐదు వికెట్ల ప్రదర్శనతో లంక దహనం పూర్తి చేశాడు. 358 పరుగుల భారీ ఛేదనలో 55 పరుగులకే కుప్పకూలిన లంకేయులు 302 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆసియా కప్‌ ఫైనల్లో 50 పరుగులకు చేతులెత్తేసిన శ్రీలంక.. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో మరో ఐదు పరుగుల అదనంగా జోడించింది.
ఏడుకు ఏడు. భారత్‌కు ఎదురేలేదు. గ్రూప్‌ దశలో వరుసగా ఏడో విజయం సాధించిన టీమ్‌ ఇండియా ప్రపంచకప్‌ సెమీఫైనల్లోకి అధికారికంగా ప్రవేశించింది. శుభ్‌మన్‌ గిల్‌ (92), విరాట్‌ కోహ్లి (88), శ్రేయస్‌ అయ్యర్‌ (82) అర్థ సెంచరీలతో కదం తొక్కటంతో భారత్‌ 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. అజేయ భారత్‌ తర్వాతి మ్యాచ్‌లో అగ్రజట్టు దక్షిణాఫ్రికాతో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఆదివారం తలపడనుంది.
నవతెలంగాణ-ముంబయి
వాంఖడెలో ఆసియా కప్‌ ఫైనల్‌ ప్రదర్శన పునరావృతం. భారత పేసర్ల పేస్‌, స్వింగ్‌ ధాటికి శ్రీలంక వరుసగా రెండో మ్యాచ్‌లో సరెండర్‌ అయిపోయింది. మహ్మద్‌ షమి (5/18), మహ్మద్‌ సిరాజ్‌ (3/16) శ్రీలంకకు నిప్పంటించారు. నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాటర్లను వణికించారు. 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. వన్డే క్రికెట్‌ చెత్త రికార్డులను అధిగమించి 55 పరుగులు చేసింది. 358 పరుగుల భారీ ఛేదనలో 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. 302 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన టీమ్‌ ఇండియా.. గ్రూప్‌ దశలో వరుసగా ఏడో విజయం ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇది రెండో అత్యుత్తమ విజయం. శ్రీలంక బ్యాటర్లలో ఎంజెలో మాథ్యూస్‌ (12), మహీశ్‌ తీక్షణ (12 నాటౌట్‌), కసున్‌ రజిత (14) రెండెంకల స్కోరు అందుకోగలిగారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (92, 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (88, 94 బంతుల్లో 11 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (82, 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. రవీంద్ర జడేజా (35, 24 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రాణించాడు. శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మధుశంక (5/80) కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అద్భుతం చేసిన మహ్మద్‌ షమి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
షమి, సిరాజ్‌ నిప్పులు : శ్రీలంక లక్ష్యం 358 పరుగులు. కుశాల్‌ మెండిస్‌, సదీర సమరవిక్రమ, నిశాంకలు ప్రపంచకప్‌లో ఆకట్టుకున్నారు. దీంతో లక్ష్యం దిశగా లంక పోరాటం ఉంటుందనే అంచనా. కానీ టీమ్‌ ఇండియా పేసర్ల ప్రణాళికలు మరోలా ఉన్నాయి. 2023 ఆసియా కప్‌ ఫైనల్స్‌ను వాంఖడెలో పునరావృతం చేశారు. అప్పుడు కొలంబోలో శ్రీలంకను 50 పరుగులకు కుప్పకూల్చిన భారత్‌.. ఇప్పుడు 55 పరుగులకు ఖేల్‌ ఖతం చేసింది. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (3/16) ప్రపంచకప్‌లో తనదైన మార్క్‌ ప్రదర్శన చేశాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే నిశాంక (0)ను బుమ్రా అవుట్‌ చేయగా.. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలి బంతికి సిరాజ్‌ వికెట్‌ తీశాడు. కరుణరత్నె(0)ను డకౌట్‌ చేశాడు. స్వింగ్‌, పేస్‌తో దండెత్తిన సిరాజ్‌ అదే ఊపులో కుశాల్‌ మెండిస్‌ (1), సదీర సమరవిక్రమ (0)ను సైతం సాగనంపాడు. దీంతో 3.1 ఓవర్లలో 3 పరుగులకే శ్రీలంక 4 వికెట్లు చేజార్చుకుంది. కష్టాల్లో ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకను మహ్మద్‌ షమి చావు దెబ్బ కొట్టాడు. షమి తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో అసలంక (1), హేమంత (0)ను అవుట్‌ చేసి.. సిరాజ్‌, బుమ్రాతో జతకలిశాడు. షమి ధాటికి ఎంజెలో మాథ్యూస్‌ (12), చమీర (0), రజిత (14) సైతం దాసోహం అయ్యారు. ఐదు ఓవర్లలో 18 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన మహ్మద్‌ షమి..ప్రపంచకప్‌లో సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. రవీంద్ర జడేజా మాయకు మధుశంక (5) నిష్క్రమించటంతో శ్రీలంక కథ పరిసమాప్తమైంది. 19.4 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైన శ్రీలంక 302 పరుగుల తేడాతో రికార్డు ఓటమి చవిచూసింది. భారత్‌తో వన్డేల్లో వరుసగా రెండో మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగుల మార్క్‌ దాటలేదు. గ్రూప్‌ దశలో ఏడు మ్యాచుల్లో శ్రీలంకకు ఇది ఐదో ఓటమి.
గిల్‌, కోహ్లి, శ్రేయస్‌ జోరు : టాస్‌ నెగ్గిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (4) తొలి ఓవర్లోనే నిష్క్రమించగా శ్రీలంక శిబిరం ఉత్సాహపడింది. కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (92), స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (88), శ్రేయస్‌ అయ్యర్‌ (82) అర్థ సెంచరీలతో దంచికొట్టారు. గిల్‌, కోహ్లి రెండో వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. మరోవైపు కోహ్లి దూకుడు చూపించాడు. 8 ఫోర్లతో 55 బంతుల్లో గిల్‌ అర్థ సెంచరీ అందుకోగా.. కోహ్లి 8 ఫోర్ల అండతో 50 బంతుల్లోనే సాధించాడు. 27 ఓవర్ల తర్వాత కోహ్లి 82 బంతుల్లో 83, గిల్‌ 79 బంతుల్లో 68 పరుగులతో ఉన్నారు. ఈ సమయంలో గిల్‌ గేర్‌ మార్చాడు. వరుస ఓవర్లలో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో దండెత్తాడు. దీంతో కోహ్లి, గిల్‌ 86 పరుగులతో సెంచరీ దిశగా దూసుకెళ్లారు. క్రీజులో ఇద్దరూ కుదురుకోవటం, లంక బౌలర్లపై ఆధిపత్యం చూపించటంతో శతకాలు లాంఛనమే అనిపించింది. కానీ ఇద్దరూ సెంచరీ చేజార్చుకున్నారు. గిల్‌ 92 పరుగుల వద్ద నిష్క్రమించగా, ఆ వెంటనే కోహ్లి 88 పరుగుల వద్ద వికెట్‌ కోల్పోయాడు. ఈ సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వరుస మ్యాచుల్లో నిరాశపరిచిన అయ్యర్‌ శ్రీలంకపై శ్రద్ధగా పరుగులు రాబట్టాడు. నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 36 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన అయ్యర్‌.. భారత్‌కు భారీ స్కోరు అందించాడు. పేసర్లు, స్పిన్నర్లపై అలవోకగా సిక్సర్లు సంధించిన శ్రేయస్‌..మధుశంకపై వరుస సిక్సర్లు బాది ఆ తర్వాతి బంతికి వికెట్‌ చేజార్చుకున్నాడు. కెఎల్‌ రాహుల్‌ (21), సూర్యకుమార్‌ (12), రవీంద్ర జడేజా (35) రాణించారు. టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాటర్లు అర్థ సెంచరీలు సాధించటంతో భారత్‌ 357 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మధుశంక కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. రజిత, మాథ్యూస్‌, తీక్షణ, హేమంతలకు వికెట్‌ దక్కలేదు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (బి) మధుశంక 4, శుభ్‌మన్‌ గిల్‌ (సి) మెండిస్‌ (బి) మధుశంక 92, విరాట్‌ కోహ్లి (సి) నిశాంక (బి) మధుశంక 88, శ్రేయస్‌ అయ్యర్‌ (సి) తీక్షణ (బి) మధుశంక 82, కెఎల్‌ రాహుల్‌ (సి) హేమంత (బి) చమీర 21, సూర్యకుమార్‌ (సి) మెండిస్‌ (బి) మధుశంక 12, రవీంద్ర జడేజా (రనౌట్‌) 35, మహ్మద్‌ షమి రనౌట్‌ 2, జశ్‌ప్రీత్‌ బుమ్రా నాటౌట్‌ 1, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (50 ఓవర్లలో 8 వికెట్లకు) 357.
వికెట్ల పతనం : 1-4, 2-193, 3-196, 4-256, 5-276, 6-333, 7-355, 8-357.
బౌలింగ్‌ : దిల్షాన్‌ మధుశంక 10-0-80-5, దుష్మంత చమీర 10-2-71-1, కసున్‌ రజిత 9-0-65-0, ఎంజెలో మాథ్యూస్‌ 3-0-11-0, మహీశ్‌ తీక్షణ 10-0-67-0, దుశన్‌ హేమంత 8-0-52-0.
శ్రీలంక ఇన్నింగ్స్‌ : పతుం నిశాంక (ఎల్బీ) బుమ్రా 0, దిముత్‌ కరుణరత్నె (ఎల్బీ) సిరాజ్‌ 0, కుశాల్‌ మెండిస్‌ (బి) సిరాజ్‌ 1, సదీర సమరవిక్రమ (సి) అయ్యర్‌ (బి) సిరాజ్‌ 0, చరిత్‌ అసలంక (సి) జడేజా (బి) షమి 1, ఎంజెలో మాథ్యూస్‌ (బి)
షమి 12, దుశన్‌ హేమంత (సి) రాహుల్‌ (బి) షమి 0, దుష్మంత చమీర (సి) రాహుల్‌ (బి) షమి 0, మహీశ్‌ తీక్షణ నాటౌట్‌ 12, కసున్‌ రజిత (సి) గిల్‌ (బి) షమి 14, మధుశంక (సి) అయ్యర్‌ (బి) జడేజా 5,
ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 55.
వికెట్ల పతనం : 1-0, 2-2, 3-2, 4-3, 5-14, 6-14, 7-22, 8-29, 9-49, 10-55.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 5-1-8-1, మహ్మద్‌ సిరాజ్‌ 7-2-16-3, మహ్మద్‌ షమి 5-1-18-5, కుల్దీప్‌ యాదవ్‌ 2-0-3-0, రవీంద్ర జడేజా 0.4-0-4-1.