నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బహుజన వాదం రాష్ట్రంలో చాప కింద నీరులా వ్యాపిస్తున్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి బీఆర్‌ఎస్ జడ్పీటీసీ, పార్టీ సీనియర్ నేత బండారు రామ్మూర్తి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో గురువారం హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ కండువా కప్పుకున్నారని చెప్పారు. ఆయన వెంట పెద్దపల్లి మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్ల కొమురయ్య ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అగ్రవర్ణ పాలకులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలను ఓటర్లుగానే మార్చి వాళ్ల కబంధహస్తాల్లో అధికారం పెట్టుకున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 60 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో ఆరేపల్లి మధు, పెద్దపల్లి కౌన్సిలర్ పోతాను పురుషోత్తం తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ ఇంచార్జ్ దాసరి ఉష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.