నవతెలంగాణ-సూర్యాపేట
భారత రాజ్యాంగంలో దళిత గిరిజన బలహీన వర్గాలకు కల్పించిన హక్కులు రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్ల మల్ల హస్సన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపీ, డిహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి రెమిడాల రాజు లు పిలుపునిచ్చారు. కెవీపీఎస్, వ్యకాస, డీహెచ్‌పీఎస్‌్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీ లో జరిగే కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీరెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులు, మైనార్టీల పైన తీవ్రంగా దాడులు జరుగుతున్నాయన్నారు. వారిపై జరుగుతున్న దాడులు అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చివేసి మనువాదాన్ని ప్రవేశపెట్టాలని కుట్రలు చేస్తుందన్నారు. ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సవరణలు చేస్తూ నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు. రాజ్యాంగంలో దళితులకు కల్పించబడిన హక్కులు ఆచరణలో అమలు కావడం లేదన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా చూస్తూ అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు వారిపై జరుగుతున్న వివక్ష అరికట్టడం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించనున్నట్లు తెలిపారు. సంతకాల సేకరణ చలో ఢిల్లీకి అన్ని దళిత సంఘాలు సామాజిక సంఘాలు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దైద వెంకన్న, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఇరుగు రమణ, డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు సైదులు, మాజీ కౌన్సిలర్ వేల్పుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.