నేడే ఎడ్‌సెట్‌

– 31,725 మంది దరఖాస్తు
– 49 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఎడ్‌ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌-2023 రాతపరీక్ష గురువారం జరగనుంది. ఈ మేరకు ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఎ రామకృష్ణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గురువారం మూడు విడతల్లో ఈ పరీక్షను నిర్వహిస్తామని వివరించారు. ఉదయం తొమ్మిది నుంచి 11 వరకు మొదటి విడతకు 10,565 మంది, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు రెండో విడతకు 10,584 మంది, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు మూడో విడతకు 10,576 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారని తెలిపారు.