కాళేశ్వరం కుంగుతోంది

Kaleswaram sagging– నిర్మాణంలో వైఫల్యం..ప్లానింగ్‌, డిజైన్‌లో లోపాలు
– క్వాలిటీ కంట్రోల్‌,, ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ సరిగాలేవు..
– ఆందోళనకరంగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ లు
– రాష్ట్ర ప్రభుత్వానిది అసంపూర్తి సమాచారం
– మేడిగడ్డ బ్యారేజ్‌ పై డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదిక విడుదల చేసింది. కమిటీ కోరిన మొత్తం డేటాను రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని, మొత్తం 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్తిగా ఉంది. ఇన్‌స్ట్రుమెంటేషన్‌, వర్షాకాలం ముందు తర్వాత ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టులు, కంప్టేషన్‌ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్‌ పార్టీ మానిటరింగ్‌ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే ముఖ్యమైన స్ట్రక్చరల్‌ డ్రాయింగ్‌లపై తెలంగాణ సర్కార్‌ తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఈ సమాచారానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్రం నిర్వహించలేకపోయిదని కమిటి నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వకున్నట్లయితే ఇది డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ 2021 ప్రకారం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చని కూడా తెలియచేసింది.
నాలుగు అంశాల్లో వైఫల్యం వల్లే….
ప్లానింగ్‌, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌… మొత్తం ఈ నాలుగు విషయాల్లో వైఫల్యం చెందడంవల్లే మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోయిందని ఎన్డీఎస్‌ఏ స్పష్టం చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడమే కారణమని ఆ నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం వల్ల పిల్లర్స్‌ సపోర్ట్‌ బలహీనపడిందని,ఫౌండేషన్‌ మెటీరియల్‌ పటిష్టత, సామర్థ్యం తక్కువగా ఉందనితెలిపింది. బ్యారేజ్‌ లోడు వల్ల ఎక్కువగా ఎగువన ఉన్న సెకాంట్‌ పైల్స్‌ (కాంక్రీట్‌) కూడా వైఫల్యం చెందడంతో పిల్లర్లు మునిగిపోయాయని పేర్కొంది.
బ్యారేజీ ప్రణాళిక (ప్లానింగ్‌), రూపకల్పనలు (డిజైన్‌) సరిగా లేకపోవడం బ్యారేజీ వైఫల్యాన్ని స్పష్టంగా సూచిస్తోందని నివేదిక పేర్కొంది. బ్యారేజీకి జరగకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.
2019లో బ్యారేజీని ప్రారంభించినప్పటి నుండి డ్యామ్‌ నిర్వాహకులు సిమెంట్‌ కాంక్రీట్‌ దిమ్మెలను, లాంచింగ్‌ అప్రాన్‌లను సరిగా పరిశీలించలేదు. మెయింటెనెన్స్‌ చేపట్టలేదు. ఈ నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడింది. ఇది దాని వైఫల్యానికి దారి తీసింది.వర్షాకాలానికి ముందు, తర్వాత ఏవైనా అసాధారణ సమస్యలు కనిపిస్తే తనిఖీలు నిర్వహించాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ తెలంగాణ రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎన్డీఎస్‌ఓ)కు పలుమార్లు సూచించింది. అయితే ఈ సూచనలను రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ సరిగా పాటించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది చాలా పెద్ద తప్పిదం. ఇది డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ 2021లోని నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ప్రత్యేకంగా చాప్టర్‌ 10లోని 41 (బి) సెక్షన్‌ కింద తీసుకోవల్సిన చర్యలకు డ్యామ్‌ నిర్వాహకులు బాధ్యత వహించాలి.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ, డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌-2021లోని అనేక ఇతర నిబంధనలను పాటించలేదు. ఇది తీవ్రమైన సమస్య. ఎందుకంటే బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది.
కమిటీ సూచనలు
బ్యారేజ్‌ను పునరుద్దరించే వరకు చేపట్టాల్సిన చర్యలు కూడా నేషనల్‌ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ సూచించింది. మేడిగడ్డ బ్యారేజీలో ఒక బ్లాక్‌ లో ఉత్పన్నమైన ఈ సమస్య కారణంగా మొత్తం బ్యారేజీ సక్రమంగా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారం జరిగే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించడానికి ఎలాంటి అవకాశం లేదు. బ్లాక్‌ నెం.7లో ఉన్న సమస్య మరమ్మతులు చేయడానికి వీలుగా లేదు. మొత్తం బ్లాక్‌ ని పునాదుల నుంచి తొలగించి తిరిగి పున:నిర్మించాలి. నిర్మాణ సారూప్యతలను పరిగణనలోకి తీసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్‌ లోని ఇతర బ్లాక్‌లు కూడా ఇదే రీతిలో వైఫల్యం చెందే పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మొత్తం బ్యారేజీని పుననిర్మిచాల్సిన అవసరం వస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రిజర్వాయర్‌ను నింపడం వల్ల బ్యారేజీ మరింత క్షీణించే అవకాశం ఉంది. అంటే ప్రస్తుత పరిస్థితిలో బ్యారేజీ పున్ణనిర్మాణం జరిగే వరకు ఏ విధంగాను ఉపయోగించలేము. రిజర్వాయర్‌ లో నీటిని నింపకూడదు, ఒకవేళ నింపితే ఇది పైపింగ్‌ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అంటే… డ్యామ్‌ ను సరి చేసే వరకు ప్రజలకు నీటి సరఫరా చేయ్యలేని పరిస్థితి ఉంటుందని పేర్కొంది. గాంట్రీ క్రేన్‌ ఆపరేట్‌ చేయకూడదని తెలిపింది. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా ఉండటానికి, బ్యారేజీని పునరుద్ధరించే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన డిజైన్లు, నిర్మాణ పద్ధతులు కలిగి ఉన్నాయి. అంటే ఇవి కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కునే పరిస్థితులు ఉన్నాయి. అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్‌ సమస్య సంకేతాలు ఇప్పటికే ఉన్నాయి. గత రెండు రోజులుగా ఇది గమనిచండం జరిగింది. ఇలాంటి సంకేతాలు, పైపింగ్‌ సమస్యలను గుర్తించడానికి ఈ రెండు బ్యారేజీలలో వెంటనే మేడిగడ్డ బ్యారేజీతో పాటే యుద్ధ ప్రాతిపదికన తణిఖీలు నిర్వహించడం చాలా అవసరం. మేడిగడ్డ బ్యారేజ్‌ 2019లో నిర్మించబడింది. 2023 అక్టోబర్‌ 21న బ్యారేజ్‌ పునాది భారీ శబ్దంతో కుంగిపోయింది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఎ) మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్‌ 24న ఈ మేడిగడ్డ డ్యామ్‌ ను సందర్శించింది. అక్టోబర్‌ 25న తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ, సర్కార్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదు. అక్టోబర్‌ 29లోపు పూర్తి డేటాను ఇవ్వకపోతే బ్యారేజీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని భావించాల్సి వస్తోందని కమిటీ చెప్పినా కూడా తెలంగాణ సర్కార్‌ పట్టించుకోలేదని కమిటీ నివేదికలో తెలిపింది.