– పరకాల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగింత
నవతెలంగాణ – శాయంపేట : పరకాల హనుమకొండ ప్రధాన రహదారిలోని మాందారిపేట స్టేజి వద్ద సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం పరకాల రూరల్ సిఐ మల్లేష్, ఎస్సై దేవేందర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టారు. వరంగల్ నుండి పరకాల కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సిద్ధంశెట్టి నితిన్ వాహనాన్ని ఆపి, అతని వద్దనున్న బ్యాగును తనిఖీ చేయగా అందులో 97 వేల నగదు లభ్యమైంది. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఎలాంటి పత్రాలు లేకుండా 97 వేల నగదు తీసుకెళుతుండగా పట్టుకొని సీజ్ చేసి పరకాల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించినట్లు సిఐ మల్లేష్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నగదుకు సంబంధించిన పత్రాలు లేకుండా నగదు తీసుకువెళ్ళవద్దని సీఐ మల్లేష్ ప్రజలకు సూచించారు.