విచక్షణాలోచన

విచక్షణాలోచనవిశ్వ రెండేళ్ల సంది హైదరాబాద్‌ అశోక్‌ నగర్‌ దగ్గరలో ఒక గది అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. పీజీ విద్య పూర్తి చేసిన అతడు ప్రభుత్వ కొలువు కోసం సన్నద్ధమౌతున్నాడు. మొదట్లో మిత్రుడితో కలిసి ఉండేవాడు. ఒక యాడాది అయ్యాక ఆర్థిక భారంతో అతడు వెళ్లిపోవడంతో అప్పటి నుండి విశ్వ ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. హాస్టల్లో ఉండి ఆ తిండి తినడం కంటే కష్టమైనా గదిలో వండుకుని తినడం ఉత్తమం అని భావించాడు. తండ్రి సన్నకారు రైతు. తల్లి కూలి పనులకు పోయేది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబమే కానీ కొడుకు ఉద్యోగం సంపాదిస్తే బతుకు మారుతుందనే ఆశతో ముందుగానే రెండు లచ్చలు వడ్డీకి తీసకొచ్చి ప్రశాంతంగా చదువుకో బిడ్డా అని నగరానికి పంపారు. చదువు తప్ప మరో ధ్యాస లేకుండా ఎట్టాగైనా కొలువు కొట్టాలని బాగానే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు విశ్వ. అయితే గ్రూప్‌ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వార్తలతో వారం సంది బుక్కులు సరిగ్గా తెరవడం లేదు. పట్టుమని పది నిమిషాలు కూడా చదవడం లేదు. పుస్తకాలు ముందేసుకోవడం, ఫోన్‌ పట్టుకొని లీకేజీ వార్తలు చూడటం. రోజూ ఇదే తంతు. ఆశలకి ఎక్కడో గండి పడ్డట్టు అయోమయపు అంధకారం బుర్రలో సుడులు తిరుగుతుంది. ఎప్పుడూ శాంతంగా ఉండే అతడిని అసహనం ఆవరించింది. అతనొక్కడిదే కాదు, కొలువు కొట్టిన తర్వాతే ఊరిలో అడుగు పెట్టాలని పట్టుదలతో నగరానికి వచ్చిన ఉద్యోగార్థులందరిదీ అదే పరిస్థితి. ఇక ఇట్టా అయితే కుదరదని ఒక్కసారి ఊరికి పోయి ఓ రెండు రోజులు ఉండి వస్తే, కాస్త వాతావరణం కుదుటపడుతుందని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు శుక్రవారం. శనివారం, ఆదివారం ఉండి మళ్ళీ సోమవారం తిరిగొద్దామని రెండు జతల బట్టలు బ్యాగులో సర్దుకొని ఊరికి బయలుదేరాడు. ఊరికి వస్తున్నా అని అమ్మానాన్నలకు ఫోన్‌ చేసి చెప్పకుండానే బస్సులో పయనమయ్యాడు. ఏ పని మీద ఎటు వెళ్ళినా అమ్మకో, నాన్నకో ఫోన్‌ చేసి చెప్పేవాడు. కానీ ఇప్పుడెందుకో సమాచారం ఇవ్వాలనిపించలేదు అతనికి.
నాలుగు గంటల ప్రయాణం అంతా పోటీ పరీక్షలపై వాట్సాప్‌ గ్రూపుల్లో జరుగుతున్న చర్చలతో గడిచిపోయింది. వాళ్ళ ఊరికి ముందు వచ్చే ఊర్లె తన బాల్య స్నేహితుడు రియజ్‌ ఉంటడు. రెండు ఊర్ల మధ్య ఒక కిలోమీటర్‌ దూరం ఉంటది. ఆడ ఉన్న పెద్ద బల్లెనే ఇద్దరూ పది వరకు కలిసి చదువుకున్నారు. వాణ్ణి కలిసి పోదాం అని ఆ ఊరి బస్‌స్టాప్‌ కాడ దిగి ఫోన్‌ చేసిండు. రియజ్‌ స్కూటర్‌ ఏసుకొని వచ్చిండు. ఇద్దరు కాసేపు ఆత్మీయంగా పలకరించుకొని, కూల్‌డ్రింక్‌ తాగి విశ్వ వాళ్ళ ఊరి వైపు స్కూటర్‌ పై బయలుదేరారు. దారిలో మిగతా స్నేహితుల యోగక్షేమాలు మాట్లాడుకుంటా వస్తున్నారు. ఊరికి సమీపిస్తుండగా చాలామంది జనం గుంపులుగా ఊళ్లెకి నడిచిపోతున్నారు. ఆ గుంపులో వాళ్ళ అమ్మ కూడా ఉండటం చూసిన విశ్వ బండి ఆపమని రియాజ్‌ బుజం తట్టి, అమ్మా అని పిలిచిండు. ఆమె వెనక్కి తిరిగి కొడుకుని చూసి దగ్గరకి వచ్చింది. అమ్మా అంతా ఎటుపోయి వస్తున్నారు, ఏమైంది అని తల్లిని అడిగిండు. అనుకోకుండా వచ్చిన కొడుకుని చూసిన ఆమె అయ్యా.. నువ్వెప్పుడు వచ్చినవ్‌? అని కాస్త కంగారుగా అన్నది.
ఇప్పుడే వస్తున్నా.. కాని ఏమైంది? ఎటుపోయి వస్తున్నారు. జనాలు ఏ సందర్భంలో అలా గుంపులుగా కూడతారో విశ్వకి ఒకపక్క తడుతూనే ఉంది. కాని విషయం ఏందని తల్లిని మల్లొకసారి అడిగిండు. మల్లయ్య తాత చచ్చిపోయిండు బిడ్డా.. ఇప్పుడే బొందబెట్టీరు. ఆడ నుంచే వస్తన్నం అన్నది దు:ఖం నిండిన గొంతుతో. ఒక్కసారి విశ్వ కొయ్యబారి పోయిండు. పొద్దుగాల పాణం ఇడిసిండు, ముసలోడికి ధైర్యం యాన్నించి వచ్చిందో ఉరేసుకున్నాడు అంటూ చెప్పుకుంట పోతుంది. ఉరి అనే పదం వినగానే నోటి నుంచి మాట పెగలడం లేదు విశ్వకి. కాసేపు ఆగి సరే అమ్మా.. నువ్వు ఇంటికి నడువ్‌, నేను వస్తా అన్నడు. రియాజ్‌ విషయం గ్రహించి బండి స్టార్ట్‌ చేసిండు. విశ్వ ఎక్కగానే అది సర్రున బొందలగడ్డ వైపు పరుగు తీసింది. ఊరికి ఎడంవైపున్న డొంకలో మైలు దూరంలో బొందలగడ్డ ఉంది. దారంతా రాళ్లు తేలి ఉంది. గుంటల్లో బండి ఎత్తేసుకుంటూ పోతుంది. విశ్వ వెనకాల శిలలా కదలకుండా కూర్చున్నాడు.
విశ్వ తన సొంత తాతని ఎప్పుడూ చూడలేదు. తన తండ్రి చిన్నగున్నప్పుడే ఆయన చనిపోయాడు. విశ్వకి గ్యావొచ్చిన కాంచి తెలిసిన తాత ఒక్కడే. అతనే పక్క ఇంట్లో ఉండే మల్లయ్య తాత. అమ్మానాయిన పన్లో ఉంటే పోయి మల్లయ్య తాత సంక ఎక్కేటోడు. వాళ్ళ ఇంట్లనే ఎక్కువ ఆడుకునేటోడు. మల్లయ్య సిమెంటు బస్తాలు చీరి, తాళ్ళు – గొడ్ల పలుపులు, బుట్లు అల్లుతుంటే ఆయన సుట్టే తిరిగేటోడు. పెద్దయ్యాక కూడా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏ మాత్రం తగ్గలేదు. మూడు నెల్ల క్రితం ఊరి నుండి వచ్చేటప్పుడు బయటికి పోయిన మల్లయ్య వచ్చేదాక ఆగి, చదువుకు పోతున్న తాత అని చెప్పి వచ్చిండు.
అయిదు నిమిషాల్లో బొందకాడికి చేసుకున్నారు. అప్పటికే బొంద పూడ్చి, పైన బంతిపూలు చల్లి, ఆపైన సర్కారు కంప కూడా పెట్టారు పాలోళ్ళు. విశ్వకి దు:ఖం తన్నుకొస్తుంది. మల్లయ్య తాతని చివరి చూపు కూడా నోచుకోలేనందుకు చింతించాడు.
***
బొంద అయ్యి పాలోళ్ళు గట్రా నీళ్ళల్ల మునిగొచ్చినంక గాబు దగ్గర కాళ్ళు కడుక్కొని, వాకిట్ల అడ్డంగా ఏసిన రోకలి బండ దాటి, ఎలిగించి పెట్టిన దీపానికి దండం పెట్టుకున్నారు. దూరభారం పొయ్యే బంధువుల కోసం కులపోల్లు బియ్యం, కూరగాయలు ఇంటింటికి తిరిగి వసూలు చేసి వండిన బోజనాలు కూర్చున్నోల్లందరికీ వడ్డించారు. ఊళ్లె ఎవరు చచ్చినా కులపోల్లు కొందరు కూడి కారం, చింతపండు, నూనే సహా మందికి సరిపడా బియ్యం, సరుకులు పోగుచేసి వండుతరు.
మల్లయ్యకి ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఇరవై గుంటల పొలం ఉంది. ఇద్దరు కొడుకులకి చెరో పది కుంటలు రాసి ఇచ్చిండు. వాళ్ళు ఉన్నూల్లెనే వేరుబడి, ఇండ్లేసుకొని ఉంటున్నారు. పక్కూరి సంబంధం దొరికితే బిడ్డకి చేతనైనంత కట్నం ఇచ్చి పెండ్లి జేసి పంపిండు. ఎవరి పన్లు వాళ్ళు జేసుకొని బతుకుబండి లాగిస్తున్నారు. ముసల్ది ఐదేండ్ల కిందటే కాలం జేసింది. అప్పటిసంది మల్లయ్య ఒక్కడే పాత ఇంట్లో ఒంటరిగా ఉండేది.
బోజనాలు అయ్యాక దగ్గరి సుట్టాలు, పెద్దమనుషులు అంతా ఒక్కాడ కూడి మూడవ రోజు చిన్న దినం, తొమ్మిదవ రోజు పెద్ద దినం చెయ్యాలని నిర్ణయించారు. చిన్నదినం ఇంటోల్ల వరకు చేసుకుంటారు కాని పెద్ద దినానికి మాత్రం కులపోల్లందరికీ, చుట్టపట్టాలందరికీ సుమారు నాలుగు వందల మందికి భోజనాలు పెట్టాలి. అందుకు మల్లయ్య చిన్న కొడుకు, పెద్దకొడుకు పొత్తుల మూడు యాటపోతులు తెస్తాం అన్నరు. బిడ్డ కూడా తన వంతుగా ఒక యాటని తెస్తా అన్నది. అన్నదమ్ముల పిల్లలు, దగ్గరి సుట్టాలు కొందరు కింటా, అరకింటా బియ్యం ఇస్తామని, రెండు వేలు, మూడు వేలు బాగం ప్రకారం ఇస్తామని, మరి కొందరు మల్లయ్య పేరు మీద స్టీల్‌ గిన్నెలు పంచుతామని ఒప్పుకున్నారు. ఆడబిడ్డలు చనిపోయినోళ్ళ పేరు కొట్టించిన గిన్నెలు పంచడం ఆనవాయితీగా వస్తుంది.
పెద్ద దినం ఖర్చు సుమారు లక్షా యాభై వేలు అయ్యేట్టు ఉంది. ఏ పొరపొచ్చాలు రాకుండా అప్పో సప్పో చేసి డబ్బు ఏర్పాటు చేసుకోండి అని మల్లయ్య ఇద్దరు కొడుకులకు ఓ పెద్దమనిషి పెద్దరికంగా చెప్పిండు. ఓ రూపాయి కిందికో, మీదికో అవుద్ది. లెక్కలోకి రాని ఖర్చులు తగులుతూనే ఉంటై. మందు ఖర్చు ఎట్లాగూ ఉండేదే.. పది రూపాయలు ఎక్కువే దగ్గరుంచుకోవాలా అని ఇంకొక్కాయన సలహా ఇచ్చిండు. ఈ ముచ్చట్లు మొదలయ్యే ముందే.. విశ్వ కూడా అక్కడికి వచ్చి ఓ మూలకి నిలబడ్డడు. పెద్దమనుషులు, సుట్టాలు మాట్లాడే మాటలన్నీ జాగ్రత్తగా విన్నడు. పెద్ద దినం గురించి చర్చ మొదలైన కానుంచి అతనికి ఆవేశం తన్నుకొస్తుంది. పాణం ఉండంగా బుక్కెడు బువ్వ పెట్టని వాళ్ళు ఇప్పుడు గొప్పగా పెద్ద దినం చేస్తామని ప్రణాళికలు రచిస్తుండటం అతనికి రుచించడం లేదు. మల్లయ్య తాత నిన్నటి దాక పడ్డ యాతన యాదికి వస్తుంటే రక్తం మరుగుతుంది.
విశ్వ బొందకాడి నుంచి వాళ్ళ ఇంటి కెళ్ళి కాళ్ళు జేతులు కడుక్కొని మంచాల కూచ్చోని వాళ్ళ అమ్మతో అన్నడు ఎందుకమ్మా.. మల్లయ్య తాత ఉరిపెట్టుకొని చనిపోయిండు. ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకోవాల్సింది కాదు, ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా అని’..
అప్పుడు ఆమె చెప్పింది… ”అయ్యా.. మల్లయ్య తాత చేతనైనన్ని రోజులు కూలి నాలికి పోయి వచ్చిన పైసలతో కలో గంజో వండుకునే తినేటోడు. ఒంట్లో సత్తువ తగ్గి, పని బంజేసినంక కొడుకులు పిలిచి గింత ముద్ద పెడితే తినేది, లేకుంటే పస్తులుండేది. కోడళ్ళ గుణాలు ఎరుకైన సంది, నోరుతెరిచి బువ్వెయ్యమని వాళ్ళని అడుగుడు బందుజేసిండు. ఎవ్వరన్నా.. పిలిచి పెడతానన్నా కూడా తినేటోడు కాదు. ఇంతెందుకు మనతో అంత మంచిగా మసిలేటోడు కదా ఒక ముద్ద తినిపోదువు రావే అని ఎన్నిసార్లు పిలిచినా ఒక్కనాడన్న రాలే.
ముసలోనికి చాదస్తం ఎక్కువని చానా మంది అనేటోళ్ళు కానీ ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువ. వయసు మీద ఉన్నప్పుడు ఎవరి దగ్గరా చెయ్యి చాచకుండా బండెడు కష్టం చేసి కుటుంబాన్ని సాకిండు. గింత పొలం కొనుక్కున్నాడు. మొన్నటి దాకా కష్టం చేసుకునే ఎవరిపై ఆధారపడకుండా బతికిండు. కాని అన్ని రోజులు మనయి కాదు కదా. ఇక వండుకొని తినుడు కష్టం అయితంది, ఓపిక ఉండటం లేదు అంటే నెలలో పదేను రోజులు పెద్ద కొడుకు, మరో పదేను రోజులు చిన్న కొడుకు వంతుల వారిగా పెడతామని ఒప్పుకున్నారు. ఓ నెల గడిచినంక కోడళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పెట్టుకోని సరిగ్గా బువ్వ పెట్టడం మానేసిండ్రు. పెట్టిన రోజైనా యాళ్ళకి పెట్టేవాళ్ళు కాదు. కొన్నిసార్లు కొడుకులకి చెప్పి చూసిండు. కాని వాళ్ళు వాళ్ళ సంసారం గురించి తప్ప ఆయన జోలి సరిగ్గా పట్టించుకోలే. అడిగినప్పుడు ఒకటి రెండు మార్లు పిలిచి సమయానికి పెట్టేవాళ్ళు. తరువాత షరా మామూలే. జ్వరం వచ్చి మూలుగుతుంటే ఎవ్వరూ ఒక్క మందు గోలీ కూడా తెచ్చి ఇయ్యలే. పైసల్లేవని తప్పించుకున్నరు. ‘బిడ్డ కాడికి పోదాం అనుకున్నా ఆమె కష్టాలు ఆమెకి ఉన్నై. చాతనైన కాడికి పోరాడి పిల్లల్ని సాదిన, ఓ ఇంటోల్లని చేసిన, నా బాధ్యతలు తీరిపోయినై. ఇక ఎవరికీ భారం కాకుడదూ, వాళ్ళని ఇబ్బంది ఎందుకు పెట్టాలి. ఇప్పుడే కంచంలో ముద్ద వెయ్యడానికే వాళ్లకి కష్టం అవుతుంది. ఇక మంచాన పడితే ఎవడు చూస్తాడు అనుకున్నడు. పాణం తీసుకుంటే ఈ ఆకలి బాధ కూడా ఉండదు కదా అని అట్టా ఊపిరి ఇడిసిండు”.
‘మా బావ పెద్దదినం మంచిగ చెయ్యాలే అల్లుళ్లూ, కోడలా” అన్నడు మేనమామ వరసయ్యే పెద్ద మనిషి. ఆ చూస్తవుగా మామా అన్నరు ముక్త కంఠంతో. విశ్వకి నరాల్లో రక్తం మరుగుతుంది. కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇక ఉండబట్టలేక గట్టిగా అరిచాడు ‘మీరు అసలు మనుషులేనా? మీలో కొంచం అన్నా మానవత్వం ఉందా? అని మల్లయ్య పిల్లల వైపు సూటిగా చూస్తూ.. మీ నాన్న ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడో సోయి ఉందా? అన్నడు కోపంగా. వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు. వెంటనే ఓ పెద్ద మనిషి కలగజేసుకొని ఏం మాట్లాడుతున్నావ్‌ పిలగా.. నీ వయస్సేంది? నువ్‌ మాట్లాడే మాటలేంది అన్నడు.
కడుపున పుట్టినోళ్ళు ఉన్నా గింత ముద్ద వెయ్యకపోవడం వల్లే కదా ఆయన ఉరేసుకున్నది. ఇప్పుడు చచ్చినంక అంత ఖర్చుకు కూడా వెనకాడటం లేదు కదా.. అదే బతికున్నప్పుడు ఎందుకు మంచి చెడులు చూడలే అని మరోసారి ప్రశ్నలు సందించిండు. పాలోళ్ళు, కులపోల్లు, సుట్టాలు అందరూ బిక్క మొకం వేసారు. చనిపోయిన వారిని ఎలాగూ తీసుకు రాలేం. పెద్దదినం అయినా మంచిగా చేస్తే ముసలోడి ఆత్మ శాంతిచ్చుద్ది అన్నడు ఓ పెద్దమనిషి తలపాగాలో ఉన్న చుట్టపీకి చేతిలోకి తీసుకుంటూ.
బతికున్నప్పుడు లేని శాంతి చచ్చాక వస్తదా అడిగిండు విశ్వ. ఆయనకి ఏం చెప్పాలో తెలియక ఏదో అనబోయి నోరు మూసుకున్నాడు. విశ్వ చెప్తున్నదేంటో ఎవరికీ ఎక్కడం లేదు. అర్ధం అయిన వాళ్ళు కూడా ఆ మాటలని సానుకూలంగా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. చదువుకున్నవుగా… ఆ మాత్రం తెలియదా మన సాంప్రదాయాలు… ఎప్పటి నుండో చేస్తున్నవే కదా.. ఇప్పుడు నువ్వేదో హీరోలా డైలాగులు చెప్తున్నావేందని కండ్లెర్ర జేస్తున్నడు తెల్ల చొక్కా, పై జేబులో పెన్ను పెట్టుకున్న సుట్టపాయన. ఆయనకి మరో ముగ్గురు నడివయస్కులు తోడయ్యారు. విశ్వ మీదికి రాబోతున్నారు. పరిస్థితి ఏదో చెయ్యి దాటేలా ఉంది. అది గమనించిన ఇద్దరు యువకులు విశ్వని అక్కడి నుంచి పక్కకు పదా అంటూ కదిల్చారు.
విశ్వాసాలకు, సంప్రదాయాలకు ఇచ్చే గౌరవం, ప్రాణంతో ఉన్నప్పుడు మనిషికి ఎందుకు ఇవ్వడం లేదు. ఆత్మకి శాంతి కలగాలని కోరే జనం, ఊపిరితో ఉన్న మనిషి అవసరాలు ఎందుకు కానడం లేదు. అప్పుడు వ్యక్తి భారంగా తోచాడు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఆర్థికభారం కాదా? ఆకలితో పోరాడలేక చచ్చిపోయిన వాడికి, ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు చేసి పెట్టినంత మాత్రాన తింటాడా…? ఇది అమాయకత్వమా? మూర్ఖత్వమా? వీళ్ళల్లో మార్పు ఎప్పుడు వస్తుంది. అసలు వస్తుందా? కష్టమేనని అతనికి తెలుసు. కాని కొత్త తరమైనా తమ ఆచారాలు, సాంప్రదాయాలు అంటూ మూస పద్ధతిలో కాలం వెళ్లదీయకుండా.. ఇకనైనా విచక్షణా జ్ఞానంతో మూఢవిశ్వాసాలకు స్వస్తి చెప్పి మానవత్వం ప్రధానంగా.. మనిషే కేంద్రంగా జీవనం సాగించాలని, దానికి ప్రశ్న నాంది కావాలని అక్కడి నుంచి నిష్క్రమించాడు.
రెండు రోజులు ఊర్లో ఉండి వెళ్లామని వచ్చినవాడు మల్లయ్య తాత అసాధారణ మరణం, మనుషుల తీరు అతన్ని మరింత మానసికాందోళనకి గురిచేయడంతో ఆరోజు రాత్రే నగరానికి తిరిగి పోవడానికి సిద్ధమయ్యాడు. మిత్రుడు రియాజ్‌ రావడంతో అమ్మానాన్నలకి చెప్పి బండెక్కాడు. ఏదో అలికిడి అనిపించి తల పక్కకి తిప్పగా వారికి పది అడుగుల దూరంలో వీధి లైటు కింద మల్లయ్య ఇద్దరు కొడుకులూ, కూతురు నిలబడి ఉన్నారు. ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూసాడు. ఆ ముగ్గురూ ఆడినుండే తమ తప్పుని గ్రహించినట్లుగా చేతులు జోడించి అతనికి దండం పెట్టారు. వయసులో చిన్నోడిని దీవించాల్సిన వాళ్ళు పశ్చాతాపపడుతూ అలా చేయడంతో విశ్వ అక్కడే ఆగిపోయాడు.

– నరేష్‌ జిల్లా, 8187808285