మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడి మతిభ్రమించి మాట్లాడుతున్న రాజగోపాల్‌రెడ్డి

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్‌
మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓడి పోయి మతిభ్రమించి రోజుకో మాట మాట్లాడుతున్నాడని బీఆర్‌ ఎస్‌ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శిం చారు. శనివారం చౌటుప్పల్‌ మున్సిపల్‌ పరిధిలోని లక్కారం గ్రామంలో ఆకాశ్‌ ప్రజాఫౌండేషన్‌ ఛైర్మన్‌ దుబ్బాక ఆకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి చెందిన వంద మంది యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్క నాటి నీరుపోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2018లో రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచాడన్నారు. గెలిచిన తర్వాత మునుగోడు అభివద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అసత్యపు ప్రచారాలతో 18వేల కోట్ల కాంట్రాక్టుకు బీజేపీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. ఉప ఎన్నికలో ఓడిపోయి మునుగోడులో కనిపించకుండా పోయాడన్నారు. ఎన్నికలు రావడంతో మళ్లీ మునుగోడు గుర్తకు వచ్చిందన్నారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటానని చెప్పి, నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నుండి బీజేపీకి, బీజేపీ నుండి మళ్లీ కాంగ్రెస్‌కు వచ్చి మతిభ్రమించి తిరుగుతున్నాడని విమర్శించారు. చలమల్ల కష్ణారెడ్డి సైతం కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పి బీజేపీలో చేరాడని, ఆ ఇద్దరూ మాట మీద నిలబడే వ్యక్తులు కాదని, దొందూదొందేనన్నారు. కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో ఛైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్‌ ఉడుగు మల్లేశ్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ ఛైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాశం సంజరుబాబు, దుబ్బాక శ్రీనివాస్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్‌, సుర్కంటి నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.