కారు.. సార్‌.. ఇక పరార్‌రు

Car.. Sir.. No more running away– ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్సే : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ – ములుగు
కారు.. సార్‌.. ఇక పరారేనని, 10 ఏండ్లలో మనల్ని దోచుకున్న కోట్ల రూపాయలతో ఓట్లు కొనడానికి వస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కాంగ్రెస్‌ పార్టీనేనని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామం మంచినీళ్ళపల్లి, హుమ్మయినగర్‌కు చెందిన సుమారు 300మంది యువకులు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే సీతక్క పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హుజారాబాద్‌ ఉప ఎన్నికల్లో రూ.1000 కోట్లు పెట్టిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారనీ, రేపు ములుగులోనూ అదే రిపీట్‌ అవుతుందన్నారు. తాను ప్రజలను నమ్ముకున్నానని, వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారనీ, తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్టు, వాళ్ళు గెలిస్తే డబ్బులు గెలిచినట్లనని అన్నారు. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎంత అగం అయిందో ఒక్కసారి ఆలోచన చెయ్యాలని, దొరల పాలన కావాలా ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్‌ కావాలా మీరే తేల్చుకోండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. అధికారంలోకి రావడానికి ఒక్క అవకాశం ఇవ్వండనీ, అగమైన తెలంగాణను బాగు చేసుకుందామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు, మద్యంతో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు పథకాల్లో.. మహాలక్ష్మి పథకం, కుటుంబంలో మహిళకు నెలకు రూ.2500 నగదు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే, ఎకరాకు రూ.15వేల పెట్టుబడి ఆర్థిక సహాయం, వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్‌, వ్యవసాయ కూలీలకు రూ.15 వేల ఆర్థిక సహాయం చేయనున్నట్టు చెప్పారు. గృహజ్యోతి పథకం, గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇంటి పథకం, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు, యువ వికాస పథకం, విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్య భరోసా కార్డు, చేేయూత పెన్షన్‌, ఆసరా పెన్షన్‌ రూ.4000 పెంపు. రైతులకు 24 గంటల కరెంటు అందించడం తదితర హామీలతో కాంగ్రెస్‌ మీ ముందుకు వస్తోంన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.