కాళేశ్వరం అవినీతిపై మోడీ ఎందుకు స్పందించరు?

– కమీషన్ల కోసమే ప్రాజెక్టుల వ్యయం పెంచారు: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనీ, ప్రజల సొమ్ము గంగపాలు కావటానికి కేసీఆర్‌ అవినీతి కారణమనీ, ఈ విషయంంలో మోడీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సీబీఐ విచారణకు మోడీ ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలేనని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తారనీ, బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రం లో బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు బిల్లులకు మద్దతిస్తారని చెప్పారు. ఈడీ మోడీ చేతుల్లో ఉంటే..ఐటీ అమిత్‌షా చేతుల్లో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..మెగా కృష్టారెడ్డి, సీఎం కేసీఆర్‌ పై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.
రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు..రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.లక్షా 20వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే..అది కుక్క తోక తగిలితే కూలి పోయేలా ఉందని ఎద్దేవా చేశారు. అన్నారం పంపు హౌస్‌ , మేడిగడ్డ పరిస్థితిపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిగ్గు తేల్చారన్నారు. 20 అంశాలపై వివరణ అడిగితే 11అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. బ్యారేజ్‌ నిర్మాణమే పనికి రాదని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌ ఇచ్చిందన్నారు. మేడిగడ్డకు వచ్చిన ఇబ్బంది రాబోయే రోజుల్లో అన్నారం , సుందిళ్లకు కూడా రానుందని వారు హెచ్చరించినట్టు తెలిపారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టుల వ్యయాన్ని భారీగా పెంచారని వెల్లడించారు. అసెంబ్లీ వేదికగా సాగునీటిపై అనేక అబద్ధాలు చెప్పారనీ, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, రుణమాఫీ, పోడు భూములు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల అమలు, ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యంపై ప్రశ్నించినందుకే తెలంగాణ ద్రోహిగా ముద్ర వేయాలని చూస్తున్నారన్నారు.