ఎర్రజెండా ముద్దుబిడ్డ..

ఎర్రజెండా ముద్దుబిడ్డ..– గిరిజన సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుగులోత్‌ ధర్మా కన్నుమూత
– ప్రజా ఉద్యమాలకు తీరని లోటు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– కుటుంబానికి ప్రగాఢ సంతాపం
నవతెలంగాణ-కొత్తగూడెం
గిరిజన సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గుగులోత్‌ ధర్మా మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన గుగులోత్‌ ధర్మా (69) ఆదివారం అర్ధరాత్రి మృతిచెందారు. ఆయన భౌతికాయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని విద్యానగర్‌ కాలనీలోని ఆయన నివాసానికి సోమవారం కుటుంబ సభ్యులు తీసుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన భౌతికకాయాన్ని తమ్మినేని వీరభద్రంతో పాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్‌ సందర్శించారు. ధర్మా మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ధర్మా రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని, ప్రత్యేకంగా గిరిజనుల సంక్షేమం కోసం ఆయన విశేషమైన కృషి చేసారని తెలిపారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేయాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ కల్పించాలని, బంజారా పోరు బాట పేరుతో పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. తాను చనిపోయే వరకూ పార్టీ పూర్తికాలం కార్యకర్తగా, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారన్నారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ, పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తుందన్నారు. నివాళులర్పించిన వారిలో.. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బండారు రవికుమార్‌, ఏజే రమేష్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఉన్నారు. ధర్మా మృతికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంతాపం తెలిపారు.
సీపీఐ(ఎం) సంతాపం
గిరిజన ఉద్యమ నేత, సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్‌ నాయకులు గుగులోత్‌ ధర్మా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఆయన మరణం పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ని తెలిపారు. దశాబ్ధాలపాటు ధóర్మా నాయక్‌ గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వారి సమస్యలపై నిరంతరం కృషి చేశారని తెలిపారు. జూలూరుపాడు మండలం జెడ్‌పీటీసీగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. గిరిజన తండాల్లో, దళిత వాడల్లో స్ధానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడారని పేర్కొ న్నారు. ఉద్యోగ అవకాశాన్ని వదులుకుని ప్రజా ఉద్య మాల్లో పనిచేయటానికి ముందుకొచ్చారని తెలిపారు. యువజన, గిరిజన, వ్యవసాయ కార్మిక రంగాల్లో పనిచేస్తూ, ప్రజా ఉద్యమాల్లో ఆయన చురుగ్గా పాల్గొ న్నారని గుర్తు చేశారు. ధర్మానాయక్‌ మరణం ప్రజా ఉద్యమానికి, పార్టీకి లోటని తమ్మినేని తెలిపారు.
ఉద్యమానికి తీరని లోటు :తెలంగాణ గిరిజన సంఘం
గిరిజన సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన గుగులోత్‌ ధర్మానాయక్‌ అకాల మరణం గిరిజన ఉద్యమాలకు తీరనిలోటనీ, ఆయన మృతికి పలువురు సంతాపాన్ని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మ నాయక్‌ అధ్యక్షతన సంతాప సభను నిర్వహించారు. ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్‌. వినరుకుమార్‌, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాం నాయక్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌ బాబు, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోబన్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్‌ , సోషల్‌ మీడియా రాష్ట్ర బాధ్యులు జగదీష్‌, రజిత, గిరిజన సంఘం నాయకులు ఆర్‌ పాండు, గోపి నాయక్‌, గోరియానాయక్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ శ్రీరాం నాయక్‌ మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం తుది శ్వాస వరకు రాజీ లేని పోరాటాలు నిర్వహించారన్నారు. ఆయన గత ఐదేండ్లుగా క్యాన్సర్‌ మహమ్మారితో బాధపడుతున్నారని తెలిపారు. మధ్యలో కోలుకు న్నారనీ, అనేక గిరిజన ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. చివరిసారిగా మిర్యాలగూడ లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో పాల్గొని యువతకు స్ఫూర్తిని చ్చారని గుర్తు చేశారు. పోడు భూముల ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతంలో గిరిజనులకు అండగా నిలిచారని తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో మృతి చెందారని తెలిపారు.
గిరిజనుల్లో చైతన్యానికి ఎనలేని కృషి : సీపీఐ(ఎం) ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు
గుగులోత్‌ ధర్మా అకాల మరణం పట్ల సీపీఐ(ఎం) ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. ఆయన గిరిజన రంగంలో పనిచేస్తూ వారిలో చైతన్యానికి ఎనలేని కృషి చేశారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థి రంగం నుంచి పార్టీకి అంకితమై చివరికంటా పనిచేశారని పేర్కొన్నారు. జూలూరుపాడు మండల జెడ్పీటీసీగా పనిచేసి ప్రజల మన్ననలందుకున్నారని తెలిపారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.