మాక్స్‌వెల్‌ ఓ అద్భుతం

మాక్స్‌వెల్‌ ఓ అద్భుతం– అఫ్గాన్‌పై ఒంటిచేత్తో విజయం
– సెమీస్‌లో ఆసీస్‌ అడుగు
– ఐసీసీ 2023 ప్రపంచకప్‌
ముంబయి : గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (201 నాటౌట్‌, 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుతం చేశాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఆస్ట్రేలియాకు అద్వితీయ విజయాన్ని కట్టబెట్టాడు. అఫ్గనిస్థాన్‌పై 292 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 91/7తో ఓటమి కోరల్లో కూరుకుంది. ఈ దశలో కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (12 నాటౌట్‌, 68 బంతుల్లో 1 ఫోర్‌)తో కలిసి అజేయంగా 202 పరుగులు జోడించిన మాక్స్‌వెల్‌.. ఆస్ట్రేలియాకు 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. అగ్రజట్టు ఆస్ట్రేలియాపై చారిత్రక విజయానికి అడుగు దూరంలోనే నిలిచిన అఫ్గనిస్థాన్‌.. మాక్స్‌వెల్‌ అసమాన ఊచకోతకు బలైంది. 128 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ సాధించిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్థాన్‌ 50 ఓవర్లలో 5 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (129, 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో రాణించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
ఔరా.. మాక్స్‌వెల్‌
ఆస్ట్రేలియా లక్ష్యం 292 పరుగులు. కానీ వాంఖడె పిచ్‌పై అఫ్గాన్‌ బౌలర్లు అదరగొట్టారు. పేసర్లు, స్పిన్నర్లు మెరవటంతో ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలింది. ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ (18), మిచెల్‌ మార్ష్‌ (24) మినహా అందరూ విఫలమయ్యారు. ట్రావిశ్‌ హెడ్‌ (0), మార్నస్‌ లబుషేన్‌ (14), జోశ్‌ ఇంగ్లిశ్‌ (0), మార్కస్‌ స్టోయినిస్‌ (6), మిచెల్‌ స్టార్క్‌ (3) చేతులెత్తేశారు. 18.3 ఓవర్లలో 91 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకున్న ఆస్ట్రేలియా.. ఓటమి కోరల్లో కూరుకుంది. ఈ దశలో జతకట్టిన మాక్స్‌వెల్‌ (201 నాటౌట్‌), పాట్‌ కమిన్స్‌ (12 నాటౌట్‌) అద్భుతం చేశారు. ఆరంభంలో మాక్స్‌వెల్‌ క్యాచ్‌ను నేలపాలు చేసిన అఫ్గాన్‌.. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. ఏడు ఫోర్లతో 51 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన మాక్స్‌వెల్‌.. పది ఫోర్లు, మూడు సిక్సర్లతో 76 బంతుల్లోనే వంద కొట్టాడు. కండరాల నొప్పితో పరుగు తీసేందుకు ఇబ్బంది పడుతూనే.. 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 128 బంతుల్లో తొలి వన్డే డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాకు మరుపురాని విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు
అఫ్గనిస్థాన్‌ ఇన్నింగ్స్‌ : 291/5 (ఇబ్రహీం జద్రాన్‌ 129, రెహమత్‌ షా 30, హష్మతుల్లా 26, హాజిల్‌వుడ్‌ 2/39)
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : 293/7 (గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 201, మిచెల్‌ మార్ష్‌ 24, రషీద్‌ ఖాన్‌ 2/44, అజ్మతుల్లా 2/52)