ర‌హ‌స్య మంత‌నాలు

– అసంతప్తులకు వల
– విందు, వినోదాలతో మచ్చిక
– కండువాలు మార్చుతున్న నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతోపాటు, ఆ గ్రామంలో ప్రచార నిర్వహించినప్పుడు అక్కడ తనకు వ్యతిరేకంగా పనిచేసే నాయకులపై రహస్యమంతనాలు జరుపుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆ గ్రామంలో ఆ మండలంలో తమకు అనుకూలతలు, ప్రతికూలతలను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. అదే సందర్భంలో ప్రతికూలంగా ఉన్నట్టయితే వెంటనే తన విధేయులతో అవతలి పక్షం వారితో రహస్య మంతనాలు జరుపుతూ వారికి విందు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విషయాన్ని మూడో కంటికి తెలియకుండా జిల్లా శివారు ప్రాంతాల్లో చర్చలు జరుపుతున్నారు. ఆ వ్యక్తి స్థాయిని బట్టి వారికి ముడుపులు ముట్టజెప్పుతున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
ముఖ్యంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీి నామమాత్రంగానే పోటీచే అవకాశం ఉండగా సీపీఐ(ఎం) ప్రజా సమస్యల ఎజెండా గానే పోటీ చేస్తుంది. కాగా ప్రధాన పార్టీలు గ్రామాల్లోని కుల సంఘాలకు, ఇతర సంఘాలకు భవనాలు, రహదారులు, దేవాలయాలు సమకూర్చుతామనే హామీతో పాటు అవసరమైన నిధులు ఇస్తూ ఓట్లను గంపగుత్తుగా తమకు వచ్చేలా పాట్లు పడుతున్నారు. ప్రధాన వర్గాలను ఆకర్షించేలా ఒకరు మందు విందును ఏర్పాటు చేస్తే, మరొకరు విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది నాయకులు పుట్టినరోజు అని చెబుతూ మందు, విందు వేడుకలతో పార్టీలను నిర్వహిస్తున్నారు. వేడుకల పేరుతో అందరూ హాజరయ్యేలా చూస్తూ వారిని తమ అభ్యర్థికి ఓటు వేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఒక గ్రామంలో ఒక పార్టీలో మరొక పార్టీలోకి చేరితే, రెండో రోజు ఆ వ్యక్తిని మళ్లీ తిరిగి ఆదే పార్టీలోకి చేర్చుకుంటున్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు పార్టీలు మారుతుండడంతో కిందిస్థాయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు.
అసంతప్తులపై వల… అసంతప్తి నాయకుల పై ప్రధాన పార్టీల నాయకులు ఇతర పార్టీ నాయకులపై వల విసురుతున్నారు. వారిని రహస్యంగా కలిసి ప్రణాళికల రూపొందిస్తూ, తమ పార్టీలోకి రావాలని, కుదరనీ ఎడల తటస్థంగా ఉండాలని, వీలైతే అంతర్గతంగా మద్దతు తెలుపాలని, క్లాస్‌ షూటింగ్‌ కు సహకరిస్తే కావలసిన సహాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. నమ్మకస్తులకు అవసరమైన ప్యాకేజీలు అందిస్తున్నారు. నామినేషన్‌ ప్రక్రియ పూర్తవుగానే మరిన్ని వివరాలను అమలు చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వాళ్లు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆయా గ్రామాలలోని ప్రధాన, ద్వితీయ, దిగివ స్థాయి నాయకులకు కార్యకర్తలతో ప్రచారం చేసేందుకు వారికి అవసరమైన వాహనాలను సమకూరుస్తూ, భోజన వసతిని కల్పిస్తున్నారు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు కానీ ప్రచారం జోరుగా ఉండాలని ఎక్కడా కూడా కార్యకర్తలు తగ్గ వద్దని ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారం కొనసాగించాలని, మన నిర్వహించే ప్రచారమే మనమే గెలుస్తున్నామని ప్రభావితం చేసేలా ఉండాలని సూచిస్తున్నారు. ఏదిఏమైనా 2023 నవంబర్‌ ఎన్నికలు పార్టీలో మార్పులు, చేరికలకు వేదిక కానున్నాయి. పుట్టింది పార్టీలోనే గిట్టే వరకు ఇక్కడే ఉంటా అన్నవారు కూడా పార్టీలు మారుతుండడంతో కింది స్థాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.