పారిశ్రామిక కాలుష్య నియంత్రణ చర్యలకు హైకోర్టు ఆదేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జీడిమెట్ల పారిశ్రామికవాడలో వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకోకుండా డ్రైనేజీలోకి వదిలివేయడంపై హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కాలుష్య నియంత్రణ మండళ్లు. మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్లతోపాటు 69 పరిశ్రమలకు సోమవారం నోటీసులు జారీ చేసింది. వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నాలాల్లోకి వదులుతున్నారనే ప్రజాహిత వ్యాజ్యాన్ని సామాజిక కార్యకర్త పి.ఎల్‌.ఎన్‌. రావు దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాదే, జస్టిస్‌ ఎన్‌ వి. శ్రవణ్‌ కుమార్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఇటీవల విచారించింది. జీడిమెట్ల ప్రాంతంలో 300 పరిశ్రమలుండగా ఇందులో 70 వరకు రసాయన, ఔషధ కంపెనీలు ఐడీఏ పరిధిలో ఉన్నాయని పిటిషనర్‌ న్యాయవాది అనిరుద్‌ తెలిపారు. రోజుకు 5 లక్షల లీటర్ల ద్రవ, ఘనవ్యర్థాలను విడుదల చేస్తున్నాయని తెలిపారు. వీటిలో ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా నేరుగా నాలాల్లోకి వదులుతున్నారని చెప్పారు.
నాలాల ద్వారా ఆ కాలుష్య జలాలు హుసేన్‌ సాగర్‌, మూసీలోకి చేరుతున్నాయని అన్నారు. ఇవి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ద్వారా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తున్నాయని వివరించారు. 200 కిలో మీటర్ల మేర నదుల్లో ప్రవహిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఈ సమస్యపై వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని తెలియజేశారు. ప్రమాదకర (రెడ్‌) జోన్లోని పరిశ్రమలను ఔటర్‌ రింగు రోడ్డు ఆవలకి తరలించాలంటూ జీవో 20 జారీ చేసి దశాబ్దం దాటినా ఆచరణలోకి రాలేదని చెప్పారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడ వ్యర్థాలను రాత్రిపూట అక్రమంగా నాలాల్లోకి వదలడం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీబీ అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. జడ్చర్ల ఫార్మ సిటీ పేరుతో భూమిని ప్రభుత్వం సేకరించి అనుమతులిచ్చినా తరలింపు చేయలేదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.