డీజీపీకి సోమేష్‌ కుమార్‌ తీర్పే వర్తిస్తుంది

డీజీపీకి సోమేష్‌ కుమార్‌ తీర్పే వర్తిస్తుంది– మరో ఐదుగురికీ కూడా
– ఆరుగురు అధికారుల కేసుల్లో విచారణ జరపాలి
– ఆలిండియా సర్వీస్‌ ఆఫీసర్ల కేటాయింపుపై హైకోర్టుకు నివేదించిన కేంద్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డీజీపీ అంజనీకుమార్‌ ఏపీ క్యాడర్‌ అధికారేనని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డీజీపీ అంజనీకుమార్‌ మరో ఐదుగురు కేంద్ర సర్వీస్‌ ఆఫీసర్లు రోనాల్డ్‌ రాస్‌, జె. అనంతరాము, ఎస్‌.ఎస్‌.రావత్‌. అమ్రపాలి, అఖిలాస్‌ బిస్లలకు గతంలో సోమేష్‌కుమార్‌ కేసులో ఇచ్చిన తీర్పునే వర్తింపజేయాలని కేంద్రం హైకోర్టును కోరింది. తెలంగాణ తొలి సీఎస్‌గా చేసిన సోమేష్‌కుమార్‌ ఏపీ క్యాడర్‌ ఆఫీసరేనని హైకోర్టు తీర్పు చెప్పిందనీ, అదే తరహా తీర్పును డీజీపీ మరో ఐదుగురు అధికారులకూ వర్తింపజేయాలని కోరింది. మరో ఆరుగురు అధికారుల కేసుల్లో వ్యక్తిగత అంశాలు ఉన్నందున వాటిపై విచారణ జరిపితే తమ వాదనలను తెలియజేస్తామని చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బి. నరసింహశర్మ వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన తరుణంలో కేంద్ర సర్వీస్‌ ఆఫీసర్ల విభజనకు ప్రత్యూష్‌ కుమార్‌ సిన్హా కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఏపీ, తెలంగాణలకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి కేంద్ర సర్వీస్‌ అధికారుల విభజన చేయడాన్ని పలువురు ఆఫీసర్లు సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌)లో సవాల్‌ చేసి స్టే ఆర్డర్‌తో తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్‌ తీర్పును రద్దు చేయాలని కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది. కేంద్ర ప్రభుత్వ వాదనలపై ప్రతివాదులైన 12 మంది ఆఫీసర్లు తమ వాదనలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది.
ట్రిబ్యునల్స్‌ ఎందుకు ఏర్పాటు చేయలేదు?
రాష్ట్ర పంచాయతీరాజ్‌ యాక్ట్‌, మున్సిపల్‌ యాక్ట్‌ల కింద ఆ రెండు డిపార్ట్‌మెంట్లలో ఎదురయ్యే వివాదాల విచారణకు వీలుగా చట్ట ప్రకారం టిబ్యునల్స్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చీఫ్‌ సెక్రటరీ, జీఏడీ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, లా డిపార్ట్‌మెంట్ల ముఖ్యకార్యదర్శులకు, మున్సిపల్‌ డైరెక్టర్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టం, మున్సిపల్‌ చట్టాల కింద ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయలేదని వివరిస్తూ అందిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. దీనిని చీఫ్‌ జస్టిస్‌ అశోక్‌ ఆరాదే, జస్టిస్‌ ఎ.లక్ష్మీనారాయణల డివిజన్‌ బెంచ్‌ విచారించింది.
ఆ చట్టాల వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించు కోవడానికి ట్రైబ్యునళ్లు లేకపోవడంతో ప్రజలు రెగ్యులర్‌ కోర్టులను ఆశ్రయి స్తున్నారనీ, ఫలితంగా కోర్టుల్లో కేసులు పెరిగిపోయి కేసుల పెండింగ్‌ పెరుగుతోందనీ, కోర్టు ఫీజులు చెల్లించే స్థోమత లేక సామాన్యులకు కష్టంగా ఉందని లేఖలో పేర్కొన్నారు.
ప్రయివేటు కేంద్రానికి భూమి కేటాయింపుపై రిట్‌
ప్రయివేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్‌ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ)కు ప్రభుత్వం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో రూ.300 కోట్ల విలువైన 3 ఎకరాలకుపైగా భూమి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ దాఖలైంది. దీనిని న్యాయమూర్తులు జస్టిస్‌ కె లక్ష్మణ్‌, జస్టిస్‌ కె.సుజనలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. సీఎస్‌, లా సెక్రటరీ, ఐఏఎంసీ సీఈవోలకు నోటీసులిచ్చింది. విచారణను డిసెంబర్‌ 21కు వాయిదా వేసింది. ఎకరం భూమి వంద కోట్లకుపైగా ఉన్న విలువైన భూమితోపాటు ప్రభుత్వం ఆర్థికంగా కోట్ల రూపాయలను సాయం చేసేలా జీవోలు ఉన్నాయనీ, వాటిని రద్దు చేయాలని కేఆర్‌ రావు పిటిషన్‌ వేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనంలోనే ప్రస్తుతం ఐఏఎంసీ ఉంది.
చెరువుల భూముల్లో నిర్మాణాలపై పిల్‌
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా నిజాంపేట్‌లోని కోమటికుంట చెరువు భూముల్లో అక్రమ నిర్మాణాలను నిలిపివేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌, నిజాంపేట మున్సిపల్‌ కమిషనర్‌, ఇరిగేషన్‌ ఆఫీసర్లతో పాటు వాసవీ ఇన్‌ఫ్రా ప్రయివేట్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింధి .విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రయివేటు బిల్డర్లతో చేతులు కలిపిన అధికారులు సర్వే నంబర్‌ 127, 137లోని చెరువు భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ ఆకుల సతీశ్‌ అనే సోషల్‌ వర్కర్‌ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టింది. వాదనల తర్వాత హైకోర్టు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.