– సీపీఐ(ఎం) మునుగోడు అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
అవకాశవాద రాజకీయ అభ్యర్థులను ఓడించి పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులను గెలిపించాలని సీపీఐ(ఎం) మునుగోడు నియోజకవర్గ అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెందాల్సిన పకతి సంపదను పెట్టుబడుదారులకు చౌక ధరల్లో కట్టబెట్టిందని, పెట్టుబడుదారులు యథేచ్చగా ధరలు అధికంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన నల్లగొండ ను ఎర్రగొండ గా చెప్పుకునే విధంగా మహనీయులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల బలం నిరూపించుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ ఎర్రజెండా రాజ్యం కోసం సిపిఎం ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త ప్రత్యర్ధులకు దీటుగా గెలుపు కోసం కషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండారి నరసింహ, మండల కార్యదర్శులు నాంపల్లి చంద్రమౌళి, మిర్యాల భరత్, మోగుదాల వెంకటేశం, ఏర్పుల యాదయ్య, కర్నాటి వెంకటేశం, మండల కమిటీ సభ్యులు చాపల మారయ్య, వరుకుప్పల ముత్యాలు, బోట్ట శివ, వేముల లింగస్వామి, సాగర్ల మల్లేష్ పాల్గొన్నారు.