కమ్యూనిస్టులు లేని చట్ట సభలు విగ్రహాలులేని దేవాలయాలు

– కమ్యూనిస్టుల ప్రభావం తగ్గబట్టే అప్రజాస్వామిక పాలన
– నిత్యం ప్రజల గురించే ఆలోచించే కామ్రేడ్లను ఆదరించండి
– 10న కోదాడలో సీపీఐ(ఎం) అభ్యర్థి మట్టి పెళ్లి సైదులు నామినేషన్‌
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ- కోదాడరూరల్‌
కమ్యూనిస్టులులేని చట్ట సభలు విగ్రహాలులేని దేవాలయాలుగా మారాయని, ప్రజల గురించి ఆలోచించే వారే లేరని, సరైన చట్టాలు తీసుకురావడం లేదని, కమ్యూనిస్టుల ప్రాభల్యం తగ్గడం వల్లే ప్రజాస్వామ్యానికి తీవ్రమైన విఘాతం కలుగుతోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌ నిర్వహించిన సిపిఎం పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉన్నప్పుడు చట్ట సభలు ఇలా ఉండేవి కావన్నారు. కమ్యూనిస్టుల ప్రాభల్యం తగ్గిన నాటినుంచి దేశంలో, రాష్ట్రంలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతోందని అన్నారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆలోచించే కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించాలన్నారు. ఈ నినాదంతోనే ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. కమ్యూనిస్టులు బలహీన పడితే దేశం అథోగతి పాలవుతుందని, అరాచకం రాజ్యమేలుతుందని స్పష్టం చేశారు. ఎర్రజెండానే పీడిత ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ఏ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. మతో న్మాదులతోనే మన పోరాటమన్నారు. ఈ నేపధ్యంలో మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో మతోన్మాద పార్టీ బీజేపీని ఓడించేందుకు బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసి సీపీఐ(ఎం) తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) జిల్లావ్యాప్తంగా కోదాడ, హుజూర్‌ నగర్‌ స్థానాల్లో ఒంటరిగానే పోటీకి దిగుతుందన్నారు. పార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులకే ఓట్లు వేసి మన సత్తా ఏంటో చూపించుకుందామన్నారు. అలా కాకుండా మనం గెలిచే అవకాశం లేదని పలానా పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని, పలానా పార్టీ అభ్యర్థి గెలవాలని ఓట్లను వేరొకరికి వేయడం వల్ల మన బలం తగ్గటానికి కారణమవుతుందన్నారు. నిరంతరం శ్రామికవర్గం, ప్రజల సమస్యలపై ఉద్యమించే మన అభ్యర్థుల గెలుపునకు విశ్రవించ కుండా కషి చేయాల్సిన అవసరముందన్నారు. 10న కోదాడ అసెంబ్లీ స్థానానికి సీపీఐ(ఎం) అభ్యర్థి మట్టిపెళ్లి సైదులు నామినేషన్‌ వేస్తున్నట్లు తెలిపారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ కోదాడ అసెంబ్లీ అభ్యర్థి మట్టి పెళ్లి సైదులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మేదరమట్ల వెంకటేశ్వర రావు, జిల్లా కమిటీ సభ్యులు జె నరసింహా రావు,బెల్లంకొండ సత్యనారాయణ, దేవర వెంకట్‌ రెడ్డి, మిట్ట గడుపుల ముత్యాలు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మునగాల మోతే అనంతగిరి కోదాడ రూరల్‌ చిలుకూరు పార్టీ మండల కార్యదర్శిలు చందా చంద్రయ్య, ముల్కూరి గోపాల్‌ రెడ్డి, రాపో లు సూర్యనా రాయణ,బ్రహ్మయ్య,నాగటి చిన్న రాములు, నాయకులు వేనేపల్లి వెంకటేశ్వర రావు, గుంటగాని యేసు తదితరులు పాల్గొన్నారు.