– మల్లు లక్ష్మీని గెలిపించండి
నవతెలంగాణ- పాలకీడు
మతోన్మాద బిజెపిని, నియంతృత్వం పాలన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీలను గద్దె దించాలని పాలకీడు మండల సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. బుధవారం మండల కేంద్రంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు మిషన్ నరసింహ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు.ఈనెల 10వ తేదీన భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పనిచేసిన వీర వనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వారసత్వాన్ని అందుకొని, పేదల పక్షాన బహుజనల పక్షాన మహిళల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతున్న సిపిఎం పార్టీ హుజూర్నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా మల్లు లక్ష్మి నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాతంత్ర వాదులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి అనంత ప్రకాష్ కోరారు.ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రభుత్వ సంస్థలను అప్పనంగా ఆదాని అంబానీలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు అంశంపైనే ఉద్యమాలు జరిగి తెలంగాణ ఏర్పడిందని, ఈ రోజున తెలంగాణలో నిధులు లేవు నియామకాలు లేవు ,ఉద్యోగాలు లేవు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. అందుకే ఈ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడించాలని, నిరంతరం ప్రజా సమస్యల ఎజెండాగా,పేద, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మల్లు లక్ష్మి ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్, సిపిఎం మండల నాయకులు దిద్దకుంట్ల పురుషోత్తం రెడ్డి, మాతంగి ఏసురత్నం,ఆర్లపూడి వీరభద్రం, నన్నెపంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.