సవాళ్లను ఎదుర్కోవాలి

సవాళ్లను ఎదుర్కోవాలి– ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : ఎంజీయూ 3వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ డా.తమిళిసై
– పండుగలా స్నాతకోత్సవం
నవతెలంగాణ – నార్కట్‌పల్లి
సవాళ్లను ఎదుర్కొంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్‌ గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌ విద్యార్థులకు సూచించారు. బుధవారం నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం నిర్వహించారు. గవర్నర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎస్‌.రామచంద్రం విద్యార్థులకు పీహెచ్‌డీ డిగ్రీలు, బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. కలుపుగోలుతనం, సమానత్వం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా.. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రాణించాలని సూచించారు. మెరుగైన అభ్యాసం, భాగస్వామ్యం కోసం పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ అయిన ఛాన్స్‌లర్స్‌ కనెక్ట్‌ను స్వీకరించాలన్నారు. సవాలుతో కూడిన పరిస్థితుల్లోనూ సానుకూలతను కొనసాగించాలని చెప్పారు.
రూ.90 కోట్లతో యూనివర్సిటీ అభివృద్ధి చేశాం : వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య గోపాల్‌ రెడ్డి
2007లో ప్రారంభమైన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాన్ని 90 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివద్ధి చేసుకున్నామని వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య గోపాల్‌ రెడ్డి అన్నారు. స్నాతకోత్సవం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరాల్లో విశ్వవిద్యాలయంలో జరిగిన అభివృద్ధి, సాధించిన విజయాలను వివరించారు. 2018 -19, 2019 20, 2020 -21 విద్యా సంవత్సరాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. మొత్తం 17 మంది విద్యార్థులు డాక్టరేట్‌ పట్టాను, 40 మంది విద్యార్థులు బంగారు పథకాలను అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రామచంద్రం మాట్లాడుతూ.. నైతిక స్పృహతో కూడిన సమాజాన్ని నిర్మించాలన్నారు.
అంతకు ముందు గవర్నర్‌కు ఆచార్య గోపాల్‌ రెడ్డి, రిజిస్టర్‌ అల్వాల రవి, కలెక్టర్‌ కర్మన్‌, నల్లగొండ ఎస్పీ కె.అపూర్వరావు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ మిర్యాల రమేష్‌, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య లక్ష్మీకాంత రాథోడ్‌, ఎంజీయూ పూర్వ రిజిస్ట్రార్లు ఆచార్య కట్ట ముత్యంరెడ్డి, ఆచార్య ఎం.యాదగిరి, ఆచార్య తుమ్మ కృష్ణారావు, ప్రిన్సిపాల్‌ డా. అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.