కరెంట్‌ కావాలా..? కాంగ్రెస్‌ కావాలా..?

కరెంట్‌ కావాలా..? కాంగ్రెస్‌ కావాలా..?– సంగారెడ్డి అభివృద్ధి బాధ్యత తీసుకుంటా
– కర్నాటకలో కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంట్‌ పోయింది
– మీరేసే ఓటు ప్రభాకర్‌కు కాదు కేసీఆర్‌కు..
– సంగారెడ్డిలో భారీ రోడ్‌ షో
– విద్యార్థి, యువజన ఆత్మీయ సభలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
24 గంటలు వచ్చే కరెంట్‌ కావాలా.. కాలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు… పేలిపోయే మోటర్లతో ఇబ్బంది పెట్టి కరెంట్‌ లేకుండా చేసే కాంగ్రెస్‌ కావాలా.. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. బుధవారం సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింత ప్రభాకర్‌ గెలుపును ఆకాంక్షిస్తూ పట్టణంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. కంది కింగ్స్‌ దాబా నుంచి సంగారెడ్డి పాత బస్టాండ్‌ వరకు వేలాది మోటార్‌ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేటీఆర్‌కు విద్యార్థి, యుజనులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గంజి మైదానంలో నిర్వహించిన విద్యార్థి, యువజన ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. చింత ప్రభాకర్‌ గెలుపు కోసం విద్యార్థి, యువజనులు నిర్వహించిన రోడ్‌ షో చూస్తుంటే జోష్‌ కాదు.. గెలుపు జులూస్‌లా కనిపించిందన్నారు. సంగారెడ్డి ప్రజలేసే ఓటు చింత ప్రభాకర్‌కు కాదని సీఎం కేసీఆర్‌కు వేసినట్లని తెలిపారు. సంగారెడ్డికి పక్కనే 50 కి.మీ దూరంలో ఉన్న కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అక్కడ కరెంట్‌ పోయిందన్నారు. రైతులకు ఐదు గంటల కరెంట్‌ కూడా ఇవ్వట్లేదన్నారు. ఏవేవో కబుర్లు చెబుతూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని కాంగ్రెసోళ్లు అడుగుతున్నారని, ఒక్కసారేమీ 11 సార్లు చాన్స్‌ ఇచ్చినా ప్రజలకు ఏం చేశారో తెల్వదా అని ప్రశ్నించారు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనార్టీల అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఖర్చు చేసింది కేసీఆర్‌ మాత్రమేనన్నారు. దేశంలో బీజేపీకి పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్‌ పోరాడుతుంటే కాంగ్రెసోళ్లు బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీటీం అంటున్నారంటే అర్థం పర్థంలేదన్నారు. కేసీఆర్‌ అంటే బీజేపీ, కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు.
ప్రాణమున్నంత కాలం ప్రజలతోనే ఉంటా: చింత ప్రభాకర్‌
బొందిలో ప్రాణమున్నంత కాలం ప్రజలతోనే ఉంటానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చింత ప్రభాకర్‌ అన్నారు. సంగారెడ్డిలో 2014లో ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యే అయ్యే అవకాశమిస్తే నియోజవకర్గ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉంటూ సేవ చేశానన్నారు. నాకు ఆరోగ్యం బాగలేకపోతే ప్రజలు, మహిళలు చేసిన ప్రార్థనలు, ఇచ్చిన దీవనల వల్లనే మీ మధ్యలో ఉండగలుగుతున్నానని ఉద్వేగ భరితంగా చెప్పారు. నియోజకవర్గంలో ఐటీ హబ్‌, సంగారెడ్డి వరకు మెట్రో లైన్‌ కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, నియోజకవర్గ సమన్వయ కర్త పట్నం మాణిక్యం, సీడీపీ చైర్మెన్‌ కాసర్ల బుచ్చిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి రవి, వైస్‌ చైర్‌పర్సన్‌ లతా విజయేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.