మంథనిలో ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ

– సైకిల్‌ దిగి కారెక్కిన తెలుగు తమ్ముళ్లు
– పుట్ట మధూకర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక
నవ తెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో మంథని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. అనేక ఏండ్లుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాయకులంతా ఆ పార్టీని వీడారు. రెండు రోజుల క్రితం మంథనిలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ మాదాటి శ్రీనివాసరెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈక్రమంలో రెండు రోజుల గడువులోనే ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు టీడీపీకి గుడ్‌ బై చెప్పారు. మంథనికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు మెండే రాజయ్య, మెండే లక్ష్మి, బడుగు మహేష్‌, మట్ట శంకర్‌, మంథని సమ్మయ్యతో పాటు పలువురు నాయకులు సైకిల్‌ దిగి కారెక్కారు. గురువారం వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.