– భారత సంతతికి చెందిన ఐదుగురు మృతి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మెల్‌బోర్న్‌లోని రూరల్ విక్టోరియా ప్రాంతంలోని పబ్‌లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మెల్‌బోర్న్‌కు వాయువ్యంగా ఉన్న గ్రామీణ విక్టోరియాలోని డేలెస్‌ఫోర్డ్ లో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. రాయల్ డేల్స్‌ఫోర్డ్ హౌటల్ లాన్‌లో నిల్చున్న భారతి సంతతికి చెందిన రెండు కుటుంబా లపైకి తెల్లటి బీఎండబ్ల్యూ కారు ఒక్కసారిగా దూసుకెళ్లినట్లు తెలిపింది.
ఈ ఘటనలో వివేక్ భాటియా (38), ఆయన కుమారుడు విహాన్ (11), ప్రతిభా శర్మ (44), ఆమె కుమార్తె అన్వీ (9), జతిన్ చుగ్ (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు విక్టోరియా చీఫ్ పోలీసు కమిషనర్ షేన్ పాటన్ వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మౌంట్ మాసిడోన్‌కు చెందిన 66 ఏండ్ల వ్యక్తిగా గుర్తించినట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడని, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు.