లీడర్‌ వర్సెస్‌ లీడర్‌

Leader vs Leader– పేలుతున్న మాటల తూటాలు
– తారాస్థాయికి చేరిన వ్యక్తిగత దూషణలు
– బూతు పురాణం అందుకుంటున్న నేతలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో మొదటి అంకమైన నామినేషన్ల పర్వం పూర్తి కాకుండానే ప్రచారహోరు రణ రంగాన్ని తలపిస్తోంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన నేతలు అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నారు. తాము చేసిన పనులు, చేయాల్సిన పనుల గురించి కాకుండా వ్యక్తిగత విమర్శలకు పదును పెడుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. కొందరు ఏకంగా బూతుపురాణం అందుకుంటున్నారు.
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనేలా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. రెండు పార్టీలకు చెందిన ప్రధాన నాయకులే పదునైన పరుష పదజాలాన్ని వాడుతుండటంతో ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం అదే బాట పడుతున్నారు. ”కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ… అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి మద్యం, డబ్బూ పంచకుండా ప్రమాణం చేద్దాం అంటున్నాడు.. నోట్ల కట్టలతో దొరికిన దొంగకు అధికారం కట్టబెడితే రాష్ట్రాన్ని కోఠిలో చారానాకు అమ్మేస్తాడు.. రేవంత్‌రెడ్డి తెలంగాణ పప్పు అయిత,ే ఆలిండియా ముద్దపప్పు రాహుల్‌ గాంధీ అని” కేటీఆర్‌ విమర్శల బాణాలు సంధించారు. రేవంత్‌ అంతే ధీటుగా సమాధానం ఇస్తూ.. ”నేను కందిపప్పు లాంటి వాడిని.. కంది పప్పు తింటే ఆరోగ్యానికి మంచిది.. కేటీఆర్‌ గన్నేరు పప్పు లాంటివాడు.. అది తింటే చస్తారు” అని కౌంటర్‌ ఇచ్చారు.
మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు ఏకంగా బూతు పురాణం మొదలుపెట్టారు. పత్రికలో రాయలేని భాషలో తిట్టుకుంటున్నారు. ”మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ.. గూండా.. భస్మాసురుని లాగా ఆయన నెత్తిమీద ఆయనే చెయ్యి పెట్టుకున్నాడు.. బీఅర్‌ఎస్‌ గెంటేస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లిన మైనంపల్లి పిచ్చోడయ్యారు” అని మంత్రి మల్లారెడ్డి పరుష పదజాలం ప్రయోగించారు.
అంతే ధీటుగా మైనంపల్లి కౌంటరిస్తూ.. ”నన్ను విమర్శిస్తే ఖబర్ధార్‌.. భూకబ్జాలు, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, దళిత, గిరిజనుల భూములు లాక్కోవుడే మల్లారెడ్డి పని… అంగుటాచాప్‌(వేలిముద్రల) మంత్రి మల్లారెడ్డి” అంటూ విమర్శించారు. అయినా వెనక్కి తగ్గని మల్లారెడ్డి మాటల దాడిని ఆపడం లేదు. పదునైన, పరుష పదజాలంతో మాటల తూటాలు పేల్చుతూనే ఉన్నాడు. ఖమ్మంలో పువ్వాడ అజరు, తుమ్మల మధ్య వ్యక్తిగత దూషణలు తారాస్థాయికి చేరాయి. ”పువ్వాడ అజరు మాఫియాను పెంచి పోషిస్తున్నారు.. ప్రజలు అర చేతిలో ప్రాణం పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.. దొంగ ఓట్లు నమోదు చేయించి నీచాతినీచానికి పాల్పడుతున్నారు” అని తుమ్మల విమర్శించారు.
అంతే ధీటుగా పువ్వాడ కూడా ఎదురుదాడికి దిగారు. ”ఖమ్మం, పాలేరులో ప్రజలు ఇంటికి పంపిస్తే పొర్లు దండాలు పెడుతూ ఓట్లు అడుక్కుంటున్నారు.. తుమ్మలకు బూతులు మాట్లాడటం తప్ప మరేం రాదు.. ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు” అని అజరు ఘాటుగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపుకోసం పోరాడుతూ.. ఇదే క్రమంలో మాటాల తూటాలు పేల్చుతున్నారు. వ్యక్తిగత దూషణలతో ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.