దీపావళి సెలవు ఆదివారమే…

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దీపావళి పండుగ సెలవును ఈనెల 12వ తేదీ ఆదివారమే ఇస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే దీపావళి పండుగ సెలవు 13వ తేదీ సోమవారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం 13వ తేదీ వివిధ స్థాయిల్లో సమావేశాలు, శిక్షణా తరగతులు ఉన్నందున, సెలవు ప్రకటిస్తే ఆ కార్యక్రమాలు సజావుగా జరగవనీ, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పొరుగురాష్ట్రం అంధ్రప్రదేశ్‌లో సోమవారం దీపావళి సెలవును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.