ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు ఏకం కావాలని

– ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్యను గెెలిపించండి :
– పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య
– అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలు ఏకం కావాలని, పేద ప్రజల గొంతును శాసన సభలో వినిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాల్లో చైతన్యమైన పోరు గడ్డపై ఎర్రజెండాను ఎగరవేయాలని, సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్యను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్య శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా కార్యకర్తలు, ప్రజలు ఎర్రజెండాలతో కవాత్‌, పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.
నామినేషన్‌ అనంతరం జరిగిన సభలో నాగయ్య మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకోని రాజకీయ పార్టీలకు ఓటు అడిగే హక్కులేదని, నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు నాయకులకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. పాషా, నరహరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. వారి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తోందని, ఎట్టి పరిస్థితిల్లోనూ అడగుపెట్టనివ్వొద్దని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఈ పదేండ్లలో ప్రజలకు అర చేతిలో వైకుంఠం చూపిందన్నారు. అప్రజాస్వామిక ప్రభుత్వ పాలనకు స్వస్తి చెప్పేందుకు ఎర్రసైనం ఎన్నికల రణరంగంలో నిర్విరామ పోరాటం చేసి కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, నాయకులు భూపాల్‌, ధర్మనాయక్‌, వెంకట్రాములు, జంగారెడ్డి, ఉడుత రవి, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, సామేల్‌, జగదీశ్‌, చంద్రమోహన్‌, రాజు, శోభన్‌, కవిత పాల్గొన్నారు.
మునుగోడు గడ్డ కమ్యూనిస్టుల అడ్డా సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డిని గెలిపించండి
కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
మునుగోడు గడ్డ అంటేనే కమ్యూనిస్టుల అడ్డా అని.. మళ్లీ చరిత్రను పునరావృతం చేసే విధంగా ప్రతి కమ్యూనిస్టు కార్యకర్తా సీపీఐ(ఎం) అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. శుక్రవారం చండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి రెండోసెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చెరుపల్లి మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన మునుగోడులో తమ బలం నిరూపించుకునే సమయం ఆసన్నమైందన్నారు. యాద్రాద్రి భువనగిరి జిల్లా జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ ఎర్రజెండా రాజ్యం కోసం.. సీపీఐ(ఎం) ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్తా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌, సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌ అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యం
కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
మల్లు లక్ష్మి నామినేషన్‌ సందర్భంగా భారీ ర్యాలీ
హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యమని, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేది కమ్యూనిస్టులేనని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, సీపీఐ(ఎం) హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో మల్లు లక్ష్మి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలుగా అరిబండి లక్ష్మీనారాయణ, జూలకంటి రంగారెడ్డి తదితరులు పనిచేసి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశారన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానని మల్లు లకిë తెలిపారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీతో హుజూర్‌నగర్‌ పట్టణం ఎరుపెక్కింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి ఇందిరా సెంటర్‌ మీదుగా గాంధీ పార్క్‌ వరకు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నేతలు ఇందిర, జ్యోతి, ప్రభావతి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.