పిల్లల్లారా.. పాపల్లారా

Children.. sinnersబాలల దినోత్సవం అంటే కేవలం పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఎంతో అట్టహాసంగా పండుగ నిర్వహించడం, ఆటల పోటీలు నిర్వహించి బహుమతుల్విడమే కాదు. పిల్లలను ప్రేమించడం, వారికి ఉన్న హక్కులను సమీక్షించుకోవడం, బాలలు బాల్యాన్ని అనుభవిస్తున్న తీరుతెన్నులపై పునరాలోచన చేయడం వంటివి చేయాలి. అసలు బాలలు అంటే ఎవరు? వారికున్న హక్కులు ఏమిటి? బాలలు బాల్యాన్ని ఎట్లా అనుభవిస్తున్నారు? బాలల పరిరక్షణ బాధ్యత ఎవరిది? వంటి అనేక అంశాలను ఈ సందర్భంగా ఒక్కసారి సమీక్షించుకోవాలి.
”పాపం, పుణ్యం, ప్రపంచమార్గం/ కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా/ అయిదారేడుల పాపల్లారా!” అని శైశవగీతిలో మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు పిల్లల బాల్యం ఓ రంగుల ప్రపంచం. వారు కనే కలలు నిజం చేసుకునే కీలకమైన సమయం బాల్యం. బాల్యం బంగారు లోకం. పిల్లలంటే ఎగరడం, దూకడం, అల్లరి చేయడం సహజం. అప్పుడే వాళ్లకి బలమైన పునాదులు ఏర్పడతాయి. బాల్యం ఆనందంగా గడిపితేనే భవిష్యత్తులో సత్ప్రవర్తన, ఉన్నతమైన భావాలతో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నది నిజం. మానసిక విశ్లేషకులు కూడా అదే చెబుతున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేటి పిల్లలే రేపటి దేశ సంపద.
దురదష్టవశాత్తూ మారిన శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక పరిస్థితుల నేపథ్యంలో బాలలను ఒక యంత్రాలుగా చూస్తున్నాం. వారికున్న హక్కులను హరించి వేస్తున్నాం. వారి బాల్యాన్ని గడపకుండా అడ్డు పడుతున్నాం. చదువు పేరుతో నిత్యం బయట ప్రపంచం తెలియకుండా బంధిస్తూ, ర్యాంకుల కోసం, డబ్బులు సంపాదించే యంత్రాలుగా పరిగణిస్తున్నాం. వారికి హక్కులు లేకుండా, బాల్యం అంటే ఏమిటో తెలియకుండా ఈ గ్లోబలైజేషన్‌ యుగంలో తెలియకుండానే చకచక జరిగిపోతుంది. అందుకే ప్రముఖ విద్యావేత్త కొఠారీ ‘భారతదేశంలో బాల్యం లేదని’ ఏనాడో ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బాలల హక్కుల పైన, బాల్యం పైన ఎంతో విస్తతస్థాయిలో చర్చలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి సైతం బాలల హక్కుల కోసం ఎన్నో చట్టాలను రూపొందించింది. అయినప్పటికీ ఆచరణలో కొంత విఫలత కనిపిస్తుంది. దానికి ప్రధానంగా అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలే ముఖ్య కారకులు. బాలల సంరక్షణ బాధ్యత అనే అంశం నేడు సమాజంలో చాలా చిన్నదిగా మారిపోయింది. నైతిక విలువలు లేని విద్యా వ్యవస్థ చోటు చేసుకుంది. జగమంతా డబ్బు చుట్టే తిరుగుతుందన్న భ్రమ ప్రతి ఒక్కరిలో ఏర్పడింది.
పాఠశాలల్లో, కుటుంబాలలో, సమాజంలో పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి. పిల్లలను ఒరేరు అరేరు అని కాకుండా పేర్లు పెట్టి పిలవాలి. వాళ్లతో కలిసి మెలిసి వుంటూ, ఆప్యాయంగా ప్రేమగా సున్నితంగా వ్యవహరించాలి. పాఠశాలల్లో దండన పూర్తిగా నిషేదించాలి. బాలల హక్కుల రక్షణ కొరకు పోక్సో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. కనుమరుగవుతున్న బాల్యాన్ని ఆట, పాటల రూపంలో అందించాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ విద్య, ఆటలు, గేయాలు, కథలు, కవితలు, గ్రంథాలయ పుస్తకాల వినియోగము, పుస్తక సమీక్షలు, బాల సభల నిర్వహణ వంటి వాటిని పాఠ్యాంశాలుగా ఖచ్చితంగా అమలు చేయగలిగాలి. బాల సాహిత్యంతో విలువలు నేర్పాలి. పిల్లల్లో దాగి ఉన్న వినోదాత్మక అంశాలు, సజనాత్మక అంశాలు వెలికి తీసే విధంగా పూర్తి స్వేచ్ఛ, అవకాశాలు కల్పించాలి. పిల్లలని మానవత్వం కలిగిన మూర్తులుగా తీర్చిదిద్దాలి. నేటి బాలలే రేపటి జాతి సంపద అని ప్రతి ఒక్కరం గుర్తెరిగి, బాలలను కాపాడుకుంటేనే రాబోయే భవిష్యత్తు తరం బాగుంటుంది.