కార్మికవర్గ పోరాటాల మార్గదర్శి సీపీఐ(ఎం)

కార్మికవర్గ పోరాటాల మార్గదర్శి సీపీఐ(ఎం)– సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేయాలి
– రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ
– ఇ.పట్నంలో ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రతినిధి, యాచారం
కార్మికవర్గ పోరాటాల మార్గదర్శి సీపీఐ(ఎం).. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు బలహీనపడటం, చట్టసభల్లో లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదన్నారు. ఇ.పట్నంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో శనివారం ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి యాదయ్యను గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్రంలో మతోన్మాద, నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. మతాలు, కులాల మధ్య అల్లర్లు సృష్టించే బీజేపీని చిత్తుగా ఓడించాలని ఓటర్లను కోరారు.
సీపీఐ(ఎం) ప్రజాసంఘాల్లోకి బీఆర్‌ఎస్‌ వార్డు సభ్యుడు
యాచారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ వార్డు సభ్యులు కంబాలపల్లి కృష్ణతోపాటు పలువురు సీపీఐ(ఎం) ప్రజాసంఘా ల్లోకి చేరారు. వీరికి పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఇబ్రహీంపట్నం అభ్యర్థి పగడాల యాదయ్య తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో డబ్బు, మద్యానికి, ఇతర ప్రలోభాలకు గురికాకుండా ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టు నాయకులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కావలి జగన్‌, కొత్తపల్లి పార్టీ బాధ్యులు విప్లవకుమార్‌, శివ తదితరులు పాల్గొన్నారు.