
నవతెలంగాణ – సిద్దిపేట : సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేతల తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ కబ్జాకు గురైనట్టు తాము పత్రికలో చూశామని, ఇందులో బీఆర్ఎస్ నేతలు, మున్సిపల్ చైర్మన్, తన హస్తముందని కొందరు కాంగ్రెస్ నేతలు పని గట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి నిరాధార విమర్శలు చేయడం కాంగ్రెస్ దిగజారుడుకు నిదర్శనమన్నారు. చిల్డ్రన్ పార్క్ విషయంలో ఎవరు అక్రమాలకు పాల్పడిన, వారి వెనుక ఎంతటి వారున్న ఉపేక్షించేది లేదని, తాము కూడా ఈ విషయం పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. కావాలని తనపై, మున్సిపల్ చైర్మన్ పై బురద జల్లే ప్రయత్నాన్ని ఇక నైన కాంగ్రెస్ నేతలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే బీఆర్ఎస్ నేతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. చిల్డ్రన్ పార్క్ కబ్జా విషయం పై కాంగ్రెస్ నేతలు మున్సిపల్ కమిషనర్ కే కాదు, తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటానికి కృషి చేస్తామంటే తాము సైతం సంపూర్ణ మద్దతు తెలుపుతామని, కానీ ఎన్నికల ముంగిట ఇలాంటి చిల్లర వేశాలు మానుకుంటే మంచిదన్నారు. కబ్జాలు, స్కాములు బీఆర్ఎస్ సిద్ధాంతం కాదని, అవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య అని, దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ నేతలు ఆరు దశాబ్దాలుగా ఎంత దోచారో ప్రజలకు తెలుసన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీ పై ఎన్ని ఆరోపణలు చేసిన ప్రజా ఆశీర్వాదం తో మంత్రి హరీశ్ రావు లక్షన్నర మెజారిటీ తో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.