– గత పదేండ్లు, బీఆర్‌ఎస్ పాలించిన పదేండ్లు చూడండి : హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పాలించిన పదేండ్లలో తెలంగాణ, బీఆర్‌ఎస్ పాలన సాగిన పదేండ్లలో తెలంగాణ ఎలా ఉందో బేరీజు వేసుకుని ఆలోచించి ఓటేయాలని మంత్రి హరీశ్‌రావు ప్రజలకు సూచించారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తెలంగాణ సాధనలోనూ, రాష్ట్రం అభివృద్ధిలోనూ కేసీఆర్ రాజీపడలేదని చెప్పారు. కేంద్ర మంత్రిత్వశాఖలతో పాటు నిటిఅయోగ్ ప్రకటించిన అన్ని అవార్డుల్లో తెలంగాణ ఉండటమే రాష్ట్ర ప్రగతికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనకు, బీఆర్‌ఎస్ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కన్నీరు పెట్టిన పల్లెలు విద్యుత్, నీటి సౌకర్యాలు సమకూరి పట్టణాల నుంచి వలసలను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ అంటే గతంలో గంజి కేంద్రాలు, ఆకలి చావులనీ, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు బియ్యం ఇచ్చే స్థాయికి చేరిందన్నారు. కాంగ్రెస్ హయంలో 11వ స్థానంలో ఉన్న వైద్యారోగ్యశాఖ మూడో ర్యాంకుకు చేరుకుందని తెలిపారు. వెయ్యికి పైగా గురుకులాల ఏర్పాటు, ఆ పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని డిగ్రీ కాలేజీలు చేస్తామని తెలిపారు.
కేంద్రం వల్లే ఆలస్యం
ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ సవరించడానికి కేంద్రం ఏడాది సమయం తీసుకోవడం, రెండేండ్ల పాటు కరోనా కారణంగా నియామకాలు ఆలస్యమయ్యాయని తెలిపారు. స్థానికులకున్న 60 శాతంను 95 శాతానికి పెంచినట్టు తెలిపారు. దాదాపు ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలు భర్తీ చేశామన్నారు. ప్రయివేటు రంగంలో 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.
శివసేనతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదా?
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని హరీశ్ రావు ఖండించారు. కేవలం మైనార్టీల ఓట్ల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేనతో పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటి కాదనీ, గవర్నర్ పలు బిల్లులను, కేంద్రం నిధులను ఆపడం అందుకు నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనీ, సీఎం కేసీఆర్ సెక్యులర్ నాయకులని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశంలో తొలిసారిగా మూడో సారి ముఖ్యమంత్రి అయి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారన్నారు. తమ మ్యానిఫెస్టోనూ కాంగ్రెస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ మ్యానిఫెస్టోనూ 90 శాతం అమలు చేయడమే కాకుండా అందులో చెప్పని కళ్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేసిందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కొంత ప్రతికూలత ఉండే మాట వాస్తవమేననీ, అదే సమయంలో పాజిటివ్ ఓటింగ్ కూడా ఉంటుందన్నారు. సీఎం ఎవరు అనే దానిపై మెజారిటీ ఓటింగ్ జరగబోతుందన్నారు. దేశంలో 23 రాష్ట్రాల కన్నా తక్కువగా అప్పులు చేసినట్టు తెలిపారు.
బీజేపీ ఇవ్వదు… వట్టి మాటలే
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రూ.1,000కి మించి ఫించన్ లేదని తెలిపారు. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఇంట్లో ఒక్కరికే ఫించన్ ఇస్తున్నారని చెప్పారు. వరంగల్‌లో సైనిక్ స్కూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించినా… కేంద్ర సర్కారు కారణంగానే ఆలస్యమైందన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల తమ నిజాయితీ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ప్రశాంత్ కిశోర్ తమతో కలిసి పని చేయడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేరని చెప్పారు. ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులవుతారని తెలిపారు.
డబ్బు, మద్యం ప్రభావం తగ్గాలి
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం తగ్గాల్సిన అవసరముందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. ఆ పరిణితి రావాలని ఆకాంక్షించారు. వీటి కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడీదారులు రాకతో నిత్యం ప్రజలతో ఉండే నాయకులకు అన్యాయం జరుగుతుందన్నారు.