బీజేపీకి రాములమ్మ గుడ్‌బై

Goodbye Ramulamma to BJP– త్వరలో కాంగ్రెస్‌లో చేరిక !
– ఒక్కొక్కరుగా వీడుతున్న సీనియర్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల వేళ బీజేపీలో మరో బిగ్‌ వికెట్‌ పడింది. సినీతార విజయశాంతి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసింది. త్వరలో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నది. పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్నకొద్దీ కీలక నేతలు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతుండటం ఆ పార్టీకి ప్రాణసంకటంగా మారింది. 2020లో విజయశాంతి బీజేపీలో చేరింది. జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆమెకు రాష్ట్రంలో ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తన సేవలను పార్టీ వినియోగించుకోవడం లేదని బాహాటంగానే వెల్లడించింది. దీనిపై ఆమె పలుమార్లు ట్వీట్ల రూపంలో తన అసంతృప్తిని వెళ్లగక్కింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా దూరంగా ఉంది. దీంతో ఎన్నికల ముందు ఆమెకు పోరాటాల కమిటీ చైర్మెన్‌ బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించింది. దీనిపైనా ఆమె అసంతృప్తిగానే ఉంది. దీంతో కొంత కాలంగా ఆమె బీజేపీని వీడుతారనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి పార్టీని వీడినప్పుడే ఆమె కూడా గుడ్‌బై చెబుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ సమయంలో పార్టీని వీడట్లేదని కూడా ఆమె వివరణ ఇచ్చింది. కానీ, అనూహ్యంగా బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో మెదక్‌ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపుతామని ఆమెకు కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టమైన హామీనిచ్చినట్టు గాంధీ భవన్‌లో జోరుగా చర్చ నడుస్తున్నది. బండి సంజరుని అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత నగరశివారులో బీజేపీ అసంతృప్త నేతలంతా ఒక్కచోట భేటీ అయిన విషయం విదితమే. ఇప్పటికే ఆ పార్టీని ఏనుగు రవీందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు వీడిన విషయం విదితమే. రాములమ్మ కూడా ఆ భేటీ పాల్గొన్నవారిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో కీలక పదవిలో ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వారు చేశారు. ఆయా పార్టీల్లో ఓ వెలుగు వెలిగిన తాము ఏదో ఆశించి బీజేపీలో చేరితే కనీస గౌరవం కూడా దక్కట్లేదని వాపోయిన సంగతీ తెలిసిందే. అప్పుడే వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అమిత్‌షా, నడ్డా జోక్యం కొద్దికాలం అసంతృప్తి ఆగింది తప్పితే పార్టీని వీడటం మాత్రం ఆగట్లేదు.