అమ్ముడుపోయే వారికి ఓట్లు వేయొద్దు

Don't vote for sellouts– పోడు సాగుదారులు, రైతులకు కొండంత అండ ఎర్రజెండా : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
– వైరా మండలంలో భూక్యా వీరభద్రం ప్రచారం
నవతెలంగాణ-వైరా టౌన్‌/ఖమ్మం/మధిర/చర్ల
నాటి నుంచి నేటి వరకు పోడు సాగుదారులు, రైతులకు అండగా ఎర్రజెండా ఉన్నదని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీలు మారే అభ్యర్థులను ఓడించి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్యా వీరభద్రంను గెలిపించాలని కోరారు. బుధవారం వైరా మండల పరిధిలోని జింకలగూడెం, రెబ్బవరం, ఖానాపురం, గొల్లపూడి, పాలడుగు, వల్లాపురం, అష్టగుర్తి, గొల్లెనపాడు గ్రామాల్లో వైరా సీపీఐ(ఎం) అభ్యర్థి భూక్య వీరభద్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎవరికి ఓటు వేస్తే భద్రంగా ఉంటుందో, ఓటు విలువ, గౌరవం పెరుగుతుందో వారికి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని విజ్ఞతతో ఆలోచించాలన్నారు. అవినీతి, దోపిడీ చేసి సంపాదించిన డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కొని, ఎమ్మెల్యే పదవిని అమ్ముకునే వారికి ఓట్లు వేయొద్దని, బోడేపుడి వారసుడు భూక్య వీరభద్రంను గెలిపించాలని కోరారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ.. గతంలో వైరాలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ తరపున గెలిచారో, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆలోచించి ఓట్లు వేయాలని, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గెలిపించిన ప్రజలను మోసం చేసి కారు ఎక్కి ప్రగతి భవనం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భూక్యా వీరభద్రం పోడు రైతుల హక్కుల కోసం చర్లపల్లి జైలులో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారని గుర్తుచేశారు. అభ్యర్థి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న తనను గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రజా గొంతుక అవుతానని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, పారుపల్లి ఝాన్సీ, మండల నాయకులు బాజోజు రమణ, తూము సుధాకర్‌, కిలారు శ్రీనివాసరావు, బాణాల శ్రీనివాసరావు, గుడిమెట్ల మోహనరావు పాల్గొన్నారు.
మధిర నియోజకవర్గ సమగ్రాభివద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యం : పాలడుగు భాస్కర్‌
మధిర నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యమని మధిర అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ తెలిపారు. బుధవారం మధిర పట్టణంలో పార్టీ పట్టణ కార్యదర్శి మండవ ఫణింద్ర కుమారి అధ్యక్షతన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి స్టేషన్‌ రోడ్‌, హరిజనవాడ, విజయవాడ రోడ్డు, ముస్లిం బజార్‌, యాదవ బజార్‌, మెయిన్‌ రోడ్‌, లడక బజార్‌లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతానని, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు శీలం నరసింహారావు, ఒంగురి రాములు, తదితరులు పాల్గొన్నారు.
ముంపు బాధితులకు న్యాయం : మచ్చా వెంకటేశ్వర్లు
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ.. గోదావరి వరద ముంపు బాధితుల సమస్యపై లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కారం పుల్లయ్య విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ద్వారా వరద ముంపు బాధితులకు న్యాయం జరుగుతుందని వివరించారు. పార్టీలు మార్చే నాయకులను నమ్ముకుంటే వారు అమ్ముడుపోయిన విధంగానే ప్రజలను కూడా అమ్ముకుంటారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయించడంలో విఫలమైన ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు అడిగే నైతికత లేదన్నారు. డబ్బు, మద్యం తదితర ప్రలోభాలను ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్‌, మండల కార్యదర్శి కారం నరేష్‌, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంలో యర్రా శ్రీకాంత్‌ ప్రచారం
ఖమ్మంలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం)కి ఓటేసి తనను అసెంబ్లీకి పంపాలని సీపీఐ(ఎం) అభ్యర్థి యర్రా శ్రీకాంత్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం టూ టౌన్‌ లోని పెవిలియన్‌ గ్రౌండ్‌, మామిళ్ళగూడెం ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో రెండు కార్పొరేట్‌ శక్తులు ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని, వారు ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాడారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రమ్‌, టూ టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.