చట్టాల ముసాయిదా ఓ తప్పుల తడక

Draft Laws A lot of mistakes– క్రిమినల్‌ బిల్లులపై ప్రతిపక్ష ఎంపీల అసమ్మతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులను పరిశీలించేం దుకు నియమించిన హౌం వ్యవహారాల పార్లమెం టరీ స్టాండింగ్‌ కమిటీకి ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలు అసమ్మతి నోట్లు ఇచ్చారు. కొత్త చట్టాలను పరిశీలిస్తే… ప్రస్తుత చట్టాలను ”ఎక్కువగా కాపీ పేస్ట్‌” చేశారని పేర్కొన్నారు. హిందీ పేర్లను వ్యతిరేకించారు. సంప్రదింపులు లేకపోవడం, డొమైన్‌ నిపుణుల అభిప్రాయాల వైవిధ్యాన్ని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించారు.
మూడు కొత్త బిల్లులతో సహా భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)-1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ సాక్ష్యం చట్టం (ఈఏ)-1872 స్థానంలో భారతీయ సాక్ష్యా అధినియం బిల్లు, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఅర్పిసీ)-1973 స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత బిల్లులను ఆగస్టు 11న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
బిల్లులను 31 మంది సభ్యుల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపారు. అది గతవారం నివేదికను ఆమోదించింది. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ బ్రిజ్‌ లాల్‌ నేతృత్వం వహించారు.
అసమ్మతి నోట్లు ఇచ్చిన ఎనిమిది మంది ఎంపీలలో కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ హౌం మంత్రి పి. చిదంబరం, ఆ పార్టీ ఎంపీలు అధీర్‌ రంజన్‌ చౌదరి, రవ్‌నీత్‌ సింగ్‌, దిగ్విజయ సింగ్‌, డీఎంకే ఎంపీలు ఎన్‌.ఆర్‌. ఇలంగో, దయానిధి మారన్‌, టీఎంసీ ఎంపీలు డెరెక్‌ ఓ’బ్రియన్‌, కకోలి ఘోష్‌ దస్తిదార్‌ ఉన్నారు. మూడు బిల్లులపై చిదంబరం, ఓ’బ్రియన్‌, ఘోష్‌ దస్తిదార్‌ తన అసమ్మతి నోట్లలో అవి ప్రస్తుతం ఉన్న చట్టాలకు ”బిల్లుల్లో 93 శాతం కాపీ, పేస్ట్‌” అని అన్నారు. తమ అసమ్మతి నోట్స్‌లో దాదాపు ప్రతిపక్ష ఎంపీలందరూ బిల్లుల హిందీ పేర్లకు వ్యతిరేకంగా రాశారు. బిల్లుల రూపకల్పనలో సరైన సంప్రదింపులు జరగలేదని ప్రతిపక్ష ఎంపీలు తమ అసమ్మతి నోట్లలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎంపీలు చట్టాలలోని ”ముసాయిదా తప్పులు” అని పేర్కొన్నారు.