నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన భువనేశ్వరి మహిళా సంఘం సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. మూడు సంవత్సరాల క్రితం గ్రూప్ సభ్యులం పది మందిమీ కలిసి బ్యాంకు రుణం తీసుకున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. పదిమంది సభ్యులు నుండి ఒక సభ్యురాలు రుణం చెల్లించలేదన్నారు. దీంతో తీసుకున్న రుణాన్ని మొత్తం ఒకేసారి చెల్లిస్తే మళ్లీ కొత్త రుణం ఇప్పిస్తానని తమ క్లస్టర్ ఇంచార్జి అయిన రవి తెలపడంతో మూడు సంవత్సరాల క్రితం లోన్ మొత్తం ఒకేసారి చెల్లించినట్లు తెలిపారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నిసార్లు కొత్త రుణం గురించి అడిగినా పొంతనలేని సమాధానాలు చేస్తూ క్లస్టర్ ఇంచార్జి రవి తప్పించుకుంటున్నాడు కానీ తమకు రుణం ఇప్పించలేదని పేర్కొన్నారు. దీంతో గత మూడు సంవత్సరాలుగా తమ గ్రూప్ సభ్యులకు కొత్త రుణంతో పాటు, గత మూడు సంవత్సరాల కు సంబంధించిన పావలా వడ్డీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంఘ సభ్యులకు కొత్త రుణంతోపాటు, గతంలో తీసుకున్న రుణం చెల్లించిన దానికి పావలా వడ్డీ అందించి న్యాయం చేయాలని వినతిపత్రంలో భువనేశ్వరి మహిళా సంఘం సభ్యులు తహసిల్దారును వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు.