డబ్బు సంచులతో వస్తున్న వారిని ఓడించండి

Defeat those coming with bags of money– సీపీఐ(ఎం) మధిర అభ్యర్థి పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ-బోనకల్‌
డబ్బు సంచులతో వస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించాలని సీపీఐ(ఎం) మధిర నియోజకవర్గం అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ ఓటర్లను అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలో పాలడుగు భాస్కర్‌ గురువారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సీపీఐ(ఎం) శ్రేణులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో భాస్కర్‌ మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. మధిర – బోనకల్‌ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయిస్తానని, మధిర నియోజకవర్గంలో ఉన్న ఆయకట్టు చివర భూములకూ నాగార్జునసాగర్‌ నీటిని అందేలా కృషి చేస్తానని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న జాలిముడి ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకొస్తామన్నారు. బోనకల్‌లో తోళ్ల పరిశ్రమ, చింతకానిలో రైలు స్లీపర్‌ కోచ్‌ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముదిగొండ ప్రాంతంలో గ్రానైట్‌ పరిశ్రమల పరిరక్షణకై ఉద్యమిస్తామన్నారు. రేమిడిచర్లలో పరిశ్రమల కోసం కేటాయించిన 60 ఎకరాల భూమిని కాపాడటంతో పాటు పరిశ్రమ స్థాపనకు పోరాడతామని తెలిపారు. చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు, షేక్‌ షాజహాన్‌.. సీపీఐ(ఎం)లో చేరారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.