చైనాకు అనుకూల దిశగా తైవాన్‌ ఎన్నికలు?

Taiwan election in favor of China?బీజింగ్‌ : తైవాన్‌లో జనవరిలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో సంయుక్తంగా పోటీచేయాలని ఆ దేశంలోని చైనా అనుకూల ప్రధాన ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఒకే అధ్యక్ష అభ్యర్థిని ఎన్నికల్లో నిలపాలని కొమిన్టాంగ్‌(కెఎమ్టి), తైవాన్‌ పీపుల్స్‌ పార్టీ(టీపీపీ) కూటమిగా ఏర్పడి ఈ మేరకు బుధవారం ఓ నిర్ణయానికి వచ్చాయి. ఎన్నికల్లో గెలిస్తే ఈ కూటమి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. ఈ కూటమి టీపీపీకి చెందిన కో వెన్‌ జె నిగానీ, కెఎమ్టి కి చెందిన హౌ యుహి ని గానీ ఇరువురి ఓటింగ్‌ గణాంకాల ఆధారంగా అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టనున్నది. ఈ ఇద్దరిలో ఒకరు ఉపాధ్యక్షుడవుతారు. పాలక డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(డీపీపీ)కి చెందిన ప్రస్తుత తైవాన్‌ ఉపాధ్యక్షుడు లై చింగ్‌ టే అధ్యక్ష ఎన్నికల పోటీలో ముందున్నారు. తైవాన్‌ అధ్యక్షురాలుగావున్న సై ఇంగ్వెన్‌ స్థానంలో అధ్యక్షుడవ్వాలని ఈయన ఆశపడుతున్నాడు. సై ఇంగ్వెన్‌ ఇప్పటికే రెండు టర్మ్‌లు అధ్యక్షురాలుగా ఉంది. తైవాన్‌ రాజ్యాంగాన్ని అనుసరించి ఒక వ్యక్తి రెండు టర్మ్‌ల కంటే ఎక్కువ అధ్యక్షుడిగా ఉండకూడదు. ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడితే పాలక పార్టీ ఓడిపోయే అవకాశముంటుంది. అదే జరిగితే తైవాన్‌లో చైనా అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుంది. 2016లో సై అధ్యక్షురాలైన తరువాత చైనాతో తైవాన్‌ సంబంధాలు దెబ్బతిన్నాయి. సై అమెరికాకు చెందిన రాజకీయ నాయకులకు ఆతిథ్యం ఇవ్వటం, అమెరికా ఆయుధాలను కొనుగోలు చేయటంవంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం జరిగింది. తైవాన్‌లో శాంతి, సుస్థిరతల కోసం చైనాతో సత్సంబంధాలను ఏర్పరచుకోవటానికి బదులుగా డీపీపీకి చెందిన సై కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని కెఎమ్టీ, టిపిపి పార్టీలు ఆరోపిస్తున్నాయి.