రాజ్యాంగ సంస్కరణలకు చిట్టచివరి యత్నంగా రిఫరెండం

– డిసెంబరు 17న పోలింగ్‌
– చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌
శాన్‌ఫ్రాన్సిస్కో : డిసెంబరులో జరగనున్న రెఫరెండమే దేశ రాజ్యాంగాన్ని సంస్కరించడానికి తమ ప్రభుత్వం చేస్తున్న చివరి ప్రయత్నమని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బొరిక్‌ వ్యాఖ్యానించారు. దేశానికి సుస్థిరత అవసరమని ఆయన అన్నారు. 1980 నుండి అమల్లో వున్న రాజ్యాంగం స్థానే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలా? వద్దా? అనే విషయం నిర్ణయించడానికి డిసెంబరు 17న పోలింగ్‌ జరగనుంది. మాజీ నియంత ఆగస్టో పినొచెట్‌ హయాంలో పాత రాజ్యాంగాన్ని ఆమోదించారు. ”కొన్నేళ్ల నుండీ మనకు కొంత అస్థిరత నెలకొంది. ఉదాహరణకు మన రాజ్యాంగ క్రమంలో అస్థిరత వుంది” అని ఆయన పేర్కొన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో బిజినెస్‌ లీడర్స్‌ ఫోరం సమావేశంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఏది కావాలని ఎంపిక చేసుకున్నప్పటికీ, ఆ ప్రక్రియ ఇక ముగుస్తుంది. ఆ మేరకు నేను హామీ ఇవ్వగలను” అని చెప్పారు. ”సుదీర్ఘ కాలంలో అభివృద్ధి కావాలంటే మనకు ఒక స్థిరత్వం, కచ్చితత్వం అవసరం. చిలీ వంటి దేశానికి ఒక నిర్దిష్టత అంటే మన ఆర్థిక వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా మాత్రమే అందుతుంది.” అని ఆయన చెప్పారు. ఆసియా – పసిఫిక్‌ ఆర్థిక సహకార వేదిక సమావేశాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం చిలీ ముందుకు సాగుతోంది, భవిష్యత్తులో చేయగలిగినంత మేర చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గతేడాది ప్రధానంగా వామపక్ష భాగస్వామ్యం కలిగిన పార్లమెంట్‌ రూపొందించిన మొదటి ప్రతిపాదనను బోరిక్‌ సమర్ధించినప్పటికీ ప్రజలు తిరస్కరించారు.