– చిత్రకూట్లో బీజేపీకి ఆదరణ కరువు
చిత్రకూట్: బీజేపీ ఎప్పుడూ శ్రీరాముడి నామాన్ని స్మరిస్తూ ఉంటుంది. అయితే ఆయనకు ఆ పార్టీపై దయ కలగడం లేదు. శ్రీరాముడు తపస్సు చేసిన చిత్రకూట్లో ఆ పార్టీ ప్రదర్శన పేలవంగా ఉంటోంది. శాసనసభ ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్లోని వింధ్య ప్రాంతం లోనిదే ఈ చిత్రకూట్ నియోజకవర్గం. ఇది సాత్నా జిల్లాలోని ఓ ప్రాంతం. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడతామని 1989లో బీజేపీ జాతీయ కార్యవర్గం తీర్మానం ఆమోదించింది. అప్పటి నుంచి నాలుగు దశాబ్దాలకు పైగా ఇది బీజేపీకి ప్రధాన ఎన్నికల ప్రచారాంశంగా కొనసాగుతోంది. ఫలితంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఆరింటిని గెలుచుకుంది. కానీ పొరుగునే ఉన్న మధ్యప్రదేశ్లో ఉన్న రాముని తపోభూమి ప్రాంతంలో మాత్రం ఆ పార్టీకి ఆదరణ కరువైంది. గత 51 సంవత్సరాల్లో బీజేపీ చిత్రకూట్లో ఒకే ఒకసారి…అది కూడా కేవలం 722 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు విజయం సాధించింది. శ్రీరాముడు వనవాసం చేసిన 14 సంవత్సరాల్లో చిత్రకూటంలోనే 11 సంవత్సరాల ఆరు నెలల 21 రోజులు గడిపాడని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పాలనలో జరిగిన అభివృద్ధితో పోలిస్తే మధ్యప్రదేశ్లో జరిగింది తక్కువేనని ఆ పార్టీ కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. వింధ్య ప్రాంతంలో కుల రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తాయి. విజేతలను అవే నిర్ణయిస్తాయి. చిత్రకూట్లో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సురేంద్ర గహర్వార్, కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే నీలన్షు చతుర్వేది మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. చతుర్వేది 2017 ఉప ఎన్నికలోనూ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి గెలుపొందారు. గహర్వార్ 2008లో చిత్రకూట్లో విజయం సాధించారు.