పుస్తకం తరాల మధ్య వారధి. జ్ఞానాన్ని పంచే నిధి. అక్షరాలను తనలో అందంగా దాచుకున్న తరగని గని. తోడు నిలిచే నేస్తం. పదాలతో మనల్ని ప్రేమగా పలకరించే నేస్తం. సకల విద్యలను నేర్పే గురువు. స్ఫూర్తినిచ్చే వ్యక్తి. అది ఆనందాన్నిస్తుంది. మన అలవాట్లను మారుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. మన జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. పుస్తక పఠనం వల్ల విజ్ఞానం పొందటమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది. మనిషిని మనిషిలా ఉంచగలిగే శక్తి పుస్తకానికి ఉంది. మనసునున్న బరువును తొలగిస్తుంది. బతకడం కంటే జీవించడమంటే ఏమిటో నేర్పిస్తుంది. ప్రశ్నించడమెందుకో నేర్పిస్తుంది. కాబట్టే మార్క్సింగ్ గోర్కి రచించిన ‘అమ్మ’ నవల ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో ముద్రితమై ఎంతో మందిని ప్రభావితం చేసింది. వ్యక్తి పుట్టిన నాటి నుండి తల్లి కొన్ని విషయాలు నేర్పిస్తుంది. తండ్రి కొన్ని విషయాలు తెలియజేస్తూ వస్తాడు. గురువు నుండి ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. స్నేహితుల నుండి మరికొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటారు. జీవిత భాగస్వామి నుండి కొన్ని… ఇలా ప్రతి ఒక్కరి నుండి ఏవో విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. ఇంత మంది నుండి ఎన్ని నేర్చుకున్నా ప్రపంచం గురించిన పరిజ్ఞానం తెలుసుకోవాలంటే పుస్తక పఠనమే మార్గం. అందుకే పుస్తకం హస్తభూషణం అంటారు పెద్దలు. ఒకప్పుడు యువకుల చేతిలో సాహిత్య, సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి. వాటి గురించి విలువైన చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మచ్చుకు కూడా కనిపించడం లేదు. పుస్తకం స్థానంలో సెల్ఫోన్ హస్తభూషణమైంది. ‘క్లాసు పుస్తకాలు చదవడానికే టైమ్ లేదు. ఇక ఇతర పుస్తకాలు చదవడమా మా వల్ల కాదు’ అంటున్నారు. అయితే ఇది కేవలం ఓ సాకు మాత్రమే. మనసుంటే మార్గం ఉంటుంది. చదవాలని కోరిక ఉండాలే గానీ సమయం తప్పకుండా దొరుకుతుంది. కాస్త సమయం కేటాయించుకుని పుస్తకం చదివితే అర్థమవుతుంది. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. పుస్తకాలు చదవడం అనేది సాహిత్య పరిచయానికో, కాలక్షేపానికో కాదు పఠన ప్రభావం వల్ల వ్యక్తుల మానసిక పరిధి విస్తరిస్తుందని రకరకాల పరిశోధనలు చెబుతున్నాయి. నిజానికి బాల్యంలోనే చదవడం మొదలుపెట్టాలి. వీలుకానప్పుడు టీనేజ్లో తప్పనిసరిగా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. బ్రిటన్లోని నేషనల్ లిటరరీ ట్రస్ట్ తాజా అధ్యయనం మరోసారి పుస్తక పఠన విలువను ప్రపంచానికి చాటింది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న టీనేజర్లకు, లేని టీనేజర్లకు మధ్య వ్యత్యాసాలను అధ్యయనం చేశారు. పుస్తకాలు చదవని వారితో పోలిస్తే, చదివే వారు లోకజ్ఞానంలోనే కాదు రకరకాల సామర్ధ్యాలలోనూ మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారని ఆ అధ్యయనం తేల్చింది. పుస్తకాలు చదవడం ద్వారా లక్ష్యాన్ని నిర్దారించుకునే స్పహ ఏర్పడుతుంది. దాన్ని చేరుకోవాలనే పట్టుదల వస్తుంది. సామాజిక సమస్యలపై అవగాహన, సామాజిక స్పహ ఏర్పడతాయి. పఠనాన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా భావించే వాళ్లు మిగిలిన వాళ్లతో పోల్చితే భిన్నంగా ఆలోచించగలరు. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాలను కనుక్కోగలరు. పదిమందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది. స్వీయవిశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల తప్పులను, లోపాలను వేరొకరు వేలెత్తి చూపడానికి ముందే వాటిని సరిదిద్దుకోవచ్చు. చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుతుంది. అందుకే పఠనాన్ని మన రోజు వారి జీవితంలో ఓ భాగం చేసుకోవాలి.