బడాపార్టీల నిధుల గుట్టు కార్పొరేట్లకెరుక!

Badaparti's funds are collected by corporates!దేశంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎక్కడికక్కడ సోదాలు చేస్తుంటారు. వాహనాలను నిలబెట్టి గంటల తరబడి గాలించడంతో ఆలస్యమే గాక రాకపోకలకు అంతరాయం కూడా ఏర్పడుతుం టుంది. పత్రికలు చూస్తే పట్టుబడిన లెక్కలు గొప్పగా ఇస్తుంటారు. ఇదంతా చూడ్డానికి చాలా ఆసక్తిగా వుంటుంది. పోలీసులు ఎంత శ్రద్ధగా అక్రమ నగదును పట్టుకుంటున్నారు కదా అనిపిస్తుంది. అయితే కథలో అసలు ట్విస్టు ఇక్కడే వుంటుంది. రోడ్దు మీద కొన్ని రూ.కోట్లు పట్టుకోవడానికి ఇంత హంగామా చేసే మన వ్యవస్థ రాజమార్గంలో వేల కోట్లు పాలక పార్టీలకు కట్టబెట్టే కార్పొరేట్‌ కుబేరు లను లాబీయిస్టులను మాత్రం అసలు ముట్టు కోదు! పైగా అందుకోసం వివరాలు చెప్పనవ సరం లేని ఎన్నికల బాండ్ల వ్యవస్థ (ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ సిస్టం- ఇబిఎస్‌) ప్రవేశపెట్టింది. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు విచారణ జరిపిన సందర్భంలో కేంద్రం అభిప్రాయం అడిగింది. ఓటర్లకు అన్ని వివరాలు తెలుసుకోవలసిన అవసరమేమీ లేదని మోడీ ప్రభు త్వం తాను దాఖలు చేసిన అఫిడవిట్‌లో సెలవిచ్చిం దంటే ఆశ్చర్యం కలగొచ్చు గాని పచ్చి నిజం. ఎందు కంటే తెలుసుకుంటే తెలిసేవి ముందు తమ పార్టీ వివరాలే గనక, అంత ఆశ్చర్యపోవలసిన అవసరం వుండదు. 2018-2023 మధ్య కాలంలో దేశంలో 27దఫాలుగా రూ.13,791 కోట్ల విలువైన 24,012 ఎన్నికల బాండ్లు అమ్ముడుపోయాయి. 31 రాజకీయ పార్టీలకు మొత్తం రూ.9188 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో బీజేపీ ఒక్క దానికే 5,272 కోట్ల విలువైన బాండ్లు లభించాయి. బీజేపీకి 74 శాతం వస్తే కాంగ్రెస్‌కు 11శాతం మాత్రమే దక్కాయి. తర్వాతి స్థానంలో బిజూ జనతాదళ్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ వున్నాయి. నిజానికి ఈ మాత్రం నిధులతోనే ఆ పార్టీలు ఎన్నికలు ఇతర వ్యవహారాలు నడుపుతున్నాయనుకుంటే పొరబాటే. 2019 ఎన్నికలకు దేశ వ్యాపితంగా మొత్తం రూ.55 వేల కోట్ల నుంచి 60వేల కోట్ల వరకూ ఖర్చయి వుంటుందని ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ (ఎడిఆర్‌)) అంచనా వేసింది. ఇందులో చాలా భాగం లెక్కకు రాని నగదులోనే జరుగుతాయి. తప్పనిసరిగా అధికారికంగా చేయా ల్సిన ఖర్చులకే ఈ నిధులు ఉపయోగిస్తాయవి. అంటే మౌలిక సదుపాయాలు, ప్రచార సామగ్రి, వివిధ రకాల మీడియాలో ప్రచార ఖర్చు వంటి వాటి కోసం ఈ బాండ్ల నుంచి వచ్చే మొత్తాన్ని చూపిస్తాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ముందుకు తెచ్చిన నాటి నుంచి ప్రచార సరళి ఎలా మారిపోయిందో వేల స్క్రీన్లు ధగధగలు ఇంటర్వ్యూలు డిజిటల్‌ మీడియా మాయలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూస్తు న్నాం. తెలంగాణ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ కూడా భారీ ఎత్తునే ప్రచారం సాగిస్తున్నది, మంత్రి కేటీఆర్‌ ఈ కొత్త తరహా చిట్కాలను విస్తారంగా ఉపయోగిస్తున్నారు.
ఎన్నికల బాండ్ల రహస్యం
ఎన్నికల బాండ్లలో వుండే సౌలభ్యం ఏమంటే వాటిని ఎవరు ఎవరికి ఇచ్చారో లెక్క చూపనవసరం లేదు. వివరాలు ఇవ్వక్కర్లేదు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) బేరర్‌ బాండ్ల రూపంలో అమ్మే వాటిని ఎవరైనా కొని ఎవరికైనా ఇవ్వచ్చు. 2018 జనవరిలో ఎలక్టొరల్‌ బాండ్ల పద్ధతిని ప్రవేశపెట్టారు. అది కూడా రాజ్యాంగ సవరణ లేదా వివరణ లేకుండా ద్రవ్యబిల్లుగా దొడ్డిదోవలో తీసుకొచ్చారు. నిజానికి 2013లో యుపిఎ పాలన చివరి ఘట్టంలో పార్టీలకు విరాళాలిచ్చే కార్పొరేట్‌ కుబేరుల వివరాలు బయట పడకుండా ఏదో ఏర్పాటు తీసు కొచ్చింది. అది సరిగ్గా లేదు కనక పారదర్శకత అవసరమన్న వాదనతో మోడీ సర్కారు మొదటికే మోసం తెచ్చింది. దేశ విదేశాలకు చెందిన బడా కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో పెట్టుబడులు పెట్టి చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి ద్వారాలు తీసింది. ఇందుకోసం ఫైనాన్స్‌ చట్టంలో విదేశీ విరాళాల క్రమబద్దీకరణ చట్టాన్ని 2016 నుంచి వర్తించేలా సవరణ చేసింది. తద్వారా విదేశాల నుంచి నిధులు తీసుకున్నా తప్పు కిందకు రాకుండా కాపాడింది. దీని వెంటనంటి మరిన్ని సవరణలు. ప్రజాప్రాతినిధ్య చట్టం, కంపెనీల చట్టం, ఆదాయపు పన్ను చట్టం, రిజర్వు బ్యాంకు చట్టం, వీటన్నిటినీ 2017 ఫైనాన్స్‌ చట్ట సవరణతో మార్చి వేసింది. ఆర్‌బిఐ, ఎన్నికల సంఘం, ప్రతి పక్షాలు విమర్శకులు ఎంతగా ఆక్షేపించినా బేఖాతరు చేసి ఫైనాన్స్‌ బిల్లుగానే ఆమోదించేసింది. రాజ్యసభ బెడద లేకుండా చేసుకుంది. ఈ తతంగమంతా ఎంత పకడ్బందీగా జరిగిందో చూస్తే మోడీ ప్రభుత్వ ప్రచ్చ న్న ఎజెండాల అమలు లోతుపాతులు తెలుస్తాయి. ఈ పథకం సరైంది కాదని సీపీఐ(ఎం) వంటి పార్టీలు ఆదిలోనే విమర్శించాయి. తాము కార్పొరేట్‌ నిధులు తీసుకోవడానికి నిరాకరించాయి కూడా.
తలకిందులు తర్కాలు
సుప్రీం కోర్టులోనూ దీనిపై ప్రజాప్రయోజన వ్యా జ్యాలు నడిచాయి. రాజ్యాంగ ధర్మాససనం విచారిం చింది. 2018 నుంచి నడుస్తున్నా కేంద్రం తన వైఖరి చెప్పకపోవడంతో కేసు ముందుకు నడవలేదు. సుప్రీం కోర్టు కూడా దాన్ని తేల్చకపోవడం విమర్శకు గురైంది. ఎట్టకేలకు ఈ మధ్యనే విచారణ జరిగింది. ఆ సమయంలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరితే కేంద్రం ఏకపక్షంగా సమర్థించుకుంది. పార్టీలకు ఎవరు విరాళాలు ఇచ్చారో చెబితే వారిని వేధింపులకు గురిచేసే అవకాశం వుంది గనక బయటపెట్టడం మంచిది కాదన్నట్టు వాదించింది. అసలు ఆ వివరాలు తెలుసుకోవడం సామాన్య ప్రజల ప్రాథమిక హక్కు కాదని కూడా వాదించింది. విరాళాలు ఇవ్వడంలో గోప్యత కార్పొరేట్ల హక్కు గనక దాన్ని భంగపరిస్తే వాటి ప్రాథమిక హక్కుకు హాని అని వితండవాదన చేసింది. ఇదో తలకిందులు తర్కం. ఎందుకంటే కార్పొరేట్లు ఎప్పుడూ పాలక పార్టీలకే పెట్టుబడులు పెడతాయి. అందులోనూ ఆ సమయంలో అధికారం లో వున్న పార్టీని తమ విరాళాలతో లోబర్చుకుని ప్రయోజనాలు నెరవేర్చుకుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని దాచి పెట్టడమంటే నిధులు ఇచ్చే వారికి ప్రత్యేకంగా లాభం చేకూర్చే నిర్ణయాలు చేశాయేమో తెలుసుకోకుండా చేయడమే జరిగేది. అంతకుముందు రోజుల్లో నగదు విరాళాల వల్ల నల్ల డబ్బు విచ్చలవిడిగా చలామణిలోకి వచ్చిందని బాండ్లు తెచ్చామన్నారు. కానీ అప్పట్లో రూ.20 వేల పైన విరాళమిస్తే దాతల పేర్లు తప్పక చెప్పాల్సి వచ్చేది. ఇదే సూట్‌కేస్‌ సంస్కృతి అని, దీన్ని అంతమొందిస్తామని చెప్పిన మోడీ సర్కార్‌ వాస్తవంగా చేసింది వేల కోట్లు గుమ్మరించిన వారిని కూడా బయటపెట్టకుండా చేయడమే. కాంగ్రెస్‌ హయాంలో అంబానీలు, మోడీ వచ్చాక అదానీ చక్రం తిప్పుతున్న తీరుకు మూలం ఇదే. ఎన్నికల బాండ్లు కొన్న కంపెనీల వెనక ఎవరున్నారో కూడా ఎప్పటికి తెలియదు. పాశ్చాత్య దేశాల్లోనైతే అధ్యక్షులుగా పోటీ చేసేవారు ఇంత విరాళం సమకూర్చాలని ముందే షరతులుంటాయి. ఉదాహరణకు బుష్‌ హయాంలో ఇంధన కంపెనీల కోసం ఎలా పని చేసిందీ అనేక రకాలుగా బహిర్గత మైంది. అలా బయటపడకుండానే కేంద్రం ఇప్పుడు బాహాటంగా అదానీ అక్రమాలను దాచి పెట్టడం ఆరోపణలకు గురవుతున్నది. క్విడ్‌ప్రోకో తరహాలో కార్పొరేట్లు లోపాయికారిగా నిధులు వెదజల్లి పాలకులను లోబర్చుకుని ఇష్టానుసారం ఆడిస్తూనే వుండొచ్చు. ఎన్నికల వ్యవస్థ ఖరీదైపోయిందని సన్నాయి నొక్కులు నొక్కే హైక్లాస్‌ మేధావులు, వ్యాఖ్యాతలు తెర వెనక కార్పొరేట్ల చెలగాటం గురించి వారితో బడా పార్టీల బ్రహ్మముడి గురించి ఎప్పుడూ చెప్పరు. ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చి సామాన్య ప్రజలకూ, శ్రమజీవుల కోసం పని చేసే కమ్యూనిస్టులు సామాజిక కార్యకర్తలకూ దూరం చేసిన పాలక వర్గాల కుట్రల గురించి చెప్పవు. ఇలాంటి నేపథ్యంలోనూ టాటాలు విరాళం పంపితే తిరస్క రించిన, కోర్టులో ఈ బాండ్లకు వ్యతిరేకంగా వాదించిన సీపీఐ(ఎం) గురించి చెప్పరు. నిన్నగాక మొన్న పుట్టిన ప్రాంతీయ పార్టీలే విచ్చలవిడిగా రూ.వందల కోట్లు కుమ్మరిస్తుంటే 35 ఏండ్లు బెంగాల్‌ను, త్రిపురనూ, మరెన్నోసార్లు కేరళను పాలించిన సీపీఐ(ఎం) ఎలాంటి విలువలు పాటించిందో ప్రస్తావించరు. ఎన్నికల పోరాటం రాజకీయ విధానాల సవాలుగా గాక కోట్ల బేరంగా మార్చిన పాలకవర్గాల కుట్రలను వదలిపెట్టి కమ్యూనిస్టులు దెబ్బతిన్నారని అపహాస్యం చేస్తుంటారు. ధనాఢ్య శక్తుల విలయవిహారం మధ్య లోనూ విలువల గురించి విధానాల గురించి పోరా డుతూ సమాంతర వాణిని వినిపిస్తున్నది ప్రజల ఎజెండాను బతికిస్తున్నది వారేనన్న వాస్తవాన్ని మరు గుపరుస్తుంటారు. అలాటి నిబద్ద రాజకీయాలను ప్ర జాస్వామిక వాదులు, జనసామాన్యం ఆదరిస్తున్నారు గనకే కమ్యూనిస్టులు సమరశీల సైద్ధాంతిక పథంలో కొనసాగగలుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో విల క్షణ విధానంతో సీపీఐ(ఎం) ముందుకు సాగు తున్న తీరును గతవారం ఈ శీర్షికలో చెప్పుకున్నాం. అన నుకూలతల మధ్య కూడా పోరాటం సాగుతూ వుండాల్సిందే.
తీర్పు ఎలా వున్నా…
డబ్బు సంచుల గుమ్మరింపుతో రాజకీయ సమా నతను దెబ్బతీయడమే ఈ వ్యవస్థ సారాంశం. రాజ్యాంగంలో సోషలిజం అనే పదం ఇంకా కొనసా గుతేనే వుండగా రాజకీయ సమానత్వానికి కూడా ఎసరు పెట్టే పరిస్థితి ఇదని కాళేశ్వరం రాజ్‌ అనే ప్రముఖ న్యాయవాది ఇటీవలే రాశారు. మోడీ రాజ్యాంగం నాల్గవ భాగంలోని ఆదేశికసూత్రాలు, మూడవ భాగం లోని సమానతా సూత్రాలు కూడా అధికారికంగా దెబ్బతీసే పరిస్థితి. ఎన్నికలలో కుబేర వర్గాలు రాజకీయ సమానతకు తెచ్చే ప్రమాదం గురించి అంబేద్కర్‌ ఆనాడే హెచ్చరించారు. రాత్రికి రాత్రి ప్రభుత్వాలు కూలిపోవడానికి ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బిజెపి నేతలు ప్రకటించడానికి వెనకవున్న ధీమా ఇదే. సుప్రీంకోర్టులో ఎన్నికల బాండ్లకేసు ఆరేళ్లుగా ఎడ తెగని నిరీక్షణలో వుండగా ఒకసారి లోక్‌సభ ఎన్నికలు, 30 సార్లు శాసనసభల ఎన్నికలు జరిగిపోయాయి. చట్టం వ్యవస్థపై ఆధారపడి వుంది గాని వ్యవస్థ చట్టంపై ఆధారపడి వుండదు. కనక వచ్చే తీర్పుతోనే మొత్తం మారిపోతుందని ఆశించడానికి కూడా లేదు. ఆ తీర్పులో చేసిన విమర్శలను సాంకేతికంగా దాట వేస్తూ మరో చట్టం చేయొచ్చు.. ఓటర్లను, పార్టీలనూ, మీడియాను కూడా కొనుగోలు చేయగల కార్పొరేట్‌ శక్తులే రాజ్యలీలకు ఎన్నికలు మొదటి మెట్టవుతాయి. పాక్షిక దామాషా పద్ధతి ఓటింగు, ఎన్నికల ఖర్చును పరిమితం చేసి అది కూడా వస్తురూపంలో ప్రభుత్వమే భరించడం జరిగితే కొంతవరకైనా నిజమైన సమాన పోటీ సాధ్యమవు తుంది. మన ప్రజాస్వామ్యం పటిష్టం కావాలంటే ముందు ఎన్నికల సంస్కరణలు మొదటి అడుగు. లోక్‌సభ ఎన్నికలలోగా వాటిమీద మరోసారి సమగ్ర మైన చర్చ జరపాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై వుంది. అయితే కేంద్రం ఒత్తిడి మధ్య అదెంతవరకు సాధ్యమో సందేహమే.ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెబుతుందో చూద్దాం.

తెలకపల్లి రవి