తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏర్పాటు చేసిన ‘తగైసాల్ తమిజార్’ అవార్డును మొదట కా. శంకరయ్యకు అందించారు. అవార్డు స్వీకరించినా, దానితో పాటు ఇచ్చే పది లక్షల రూపాయలను కోవిడ్ బాధితుల కోసం సి.ఎం. సహాయ నిధికి అందించిన సహృదయుడు ఆయన. అంతేకాదు, 1972లో స్వాతంత్య్ర సమర యోధుల పెన్షన్ తీసుకోవటానికి కూడా ఆయన నిరాకరించారు. ‘మేము స్వాతంత్య్రం కోసం పోరాడాము. పెన్షన్ కోసం కాదు’ అని ప్రకటించారు. అందుకనే ఆయనను, పార్టీలకతీతంగా గౌరవిస్తారు. ప్రజలందరూ ప్రేమిస్తారు.
‘లేదు… నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు! నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లనే నేర్చుకుంటున్నాము! ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు! భయం లేదులే అయిన ప్పటికీ! నీ సాహసం ఒక ఉదాహరణ! నీ జీవితమే ఒరవడి’ కమ్యూనిస్టు యోధుడు శంకరయ్య గారి నిష్క్రమణం తర్వాత పై శ్రీశ్రీ వాక్యాలే గుర్తుకొచ్చాయి.నిజంగా ఎంత ప్రేరణాత్మక చైతన్యపూరిత జీవితం ఆయనది. పరిపూర్ణ జీవిత సాఫల్యతకు నిలువెత్తు ఉదాహరణ కామ్రేడ్ ఎన్.శంకరయ్య. స్వాతంత్య్ర సమరయోధునిగా, కమ్యూనిస్టు నాయకునిగా, మార్క్సిస్టు పార్టీ వ్యవస్థాపక నాయకులలో ఒకనిగా, ప్రజా నాయ కునిగా ఎనిమిది దశాబ్దాలు కృషి చేయటం సామాన్యమైన విషయం కాదు. చరిత్రకు ఘనమైన జీవితాన్ని అందించిన అమరుడు ఆయన. ఉత్తమమైన, ఉన్నతమైన మానవ జీవితాన్ని ఎలా జీవించాలో ఆ కామ్రేడ్ చరిత్రను చూసి తెలుసుకోవచ్చు. సీటు కోసమో, ఓటు కోసమో, పదవి కోసమో, పైస కోసమో మాటను, బాటనూ మార్చుకునే నేటి రాజకీయ విన్యాసాల వేళలో అంకిత భావం, నిబద్ధమైన ఆశయ ప్రస్థానంగల ఎన్.శంకరయ్య గారి స్మరణ కారు చీకట్లో కాంతి రేఖలా కనపడు తుంది. ఎందుకంటే, అతడనేక ప్రజా పోరాటాల స్ఫూర్తి రూపం. శతాధిక జీవితాన్ని ఆశయ సిద్ధికోసం వెచ్చించిన చరితం కనుక. ఎవరికి సాధ్యమవుతుంది! జీవితాన్ని తన కోసం, తన కుటుంబంకోసం కాక, సమాజం కోసం, అణగారిన ప్రజల కోసం, ఎన్ని ఇక్కట్లు, నిర్బంధాలు, సవాళ్లు ఎదురైనా నిబద్ధంగా నిలబడటం! అది కమ్యూనిస్టు ఆశయ పథగామికి మాత్రమే సాధ్యమయ్యే ఆచరణ. చరిత్రను ఒకసారి తిరగేయండి. పరుల కోసం, ప్రజల కోసం, వారి హక్కుల కోసం, సౌఖ్యం కోసం నిస్వార్థంగా జీవితాలను త్యాగం చేసి న వారిని కమ్యూనిస్టు ఉద్యమంలో ఎంతో మందిని మనం చూడగలుగు తాము. కేవలం చరిత్రలోనే కాదు, నేటి వర్తమానంలో కూడా, ప్రపంచీకరణ, వసు ్తవ్యామోహ, వినియోగ దారీ ద్రవ్య భ్రమల ప్రపంచంలోనూ కమ్యూనిస్టుగా నిలబ డటం మరింత కష్టమైన సమయంలోనూ నిబద్ధంగా త్యాగాలతో పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఆదర్శనీయంగా వున్నారు. కమ్యూనిస్టు ఉద్యమ ఒరవడి అలాంటిది. అలాంటి వారందరికీ శంకరయ్య జీవితం మహోన్నత ప్రేరణ.
భగత్సింగు ప్రాణత్యాగం కామ్రేడ్ శంకరయ్యలో స్వాతంత్య్ర కాంక్షను పురి కొల్పింది. తొమ్మిదేండ్ల వయసు నాటి ఆ ప్రేరణ చివరికంటా అంతే ఉత్తేజంతో ఆయనలో కొనసాగటం అబ్బురపరుస్తుంది. 1937తో మధురైలోని అమెరికన్ కాలేజీలో చరిత్రను అభ్యసిస్తున్న కాలంలోనే మద్రాసు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటులో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థి నాయకుడుగా ఎదిగారు. కళాశాలలో వామపక్ష భావాలు గల స్నేహితుల ప్రభావంతో 17 ఏండ్ల వయసులోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా చేరారు. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉంది. డిగ్రీ పరీక్షలకు కొన్ని రోజుల ముందు 1941లో బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇక అప్పటి నుండి జైళ్ల పర్యటనలు కొనసాగాయి. మధురై కుట్ర కేసులో అరెస్టు అయ్యారు. మళ్లీ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజు జైలు నుండి విడుదల య్యారు. కమ్యూనిస్టు నాయకునిగా ప్రజాదరణ పొందిన వారు తమిళనాడులో కార్మిక కర్షక ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించారు. కమ్యూనిస్టు పార్టీ చీలిక సందర్భంలో సీపీఐ(ఎం) వైపు నిలబడి చివరి వరకూ ఉన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. కిసాన్ సభ నాయకుడిగానూ పని చేశారు. శాసన సభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. గొప్ప వాగ్ధాటి గల వ్యక్తగా, సాహిత్య కళారంగాల పట్ల లోతైన అవగాహన కలిగిన శంకరయ్య గారు తమిళనాడులో సామాజిక సమస్యలపై, వివక్షతలపై పోరాడిన వ్యక్తి. నిబద్ధతతో పాటు నిరాడంబర జీవితాన్ని గడిపిన ఉన్నత విలువలు గల కమ్యూనిస్టు ఆయన. అందుకనే కమ్యూనిస్టు ఉద్యమం ఘనమైన చరిత్ర కలిగిన నేతను కోల్పోయిందని సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో నివాళులర్పించింది.
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏర్పాటు చేసిన ‘తగైసాల్ తమిజార్’ అవార్డును మొదట కా. శంకరయ్యకు అందించారు. అవార్డు స్వీకరించినా, దానితో పాటు ఇచ్చే పది లక్షల రూపాయలను కోవిడ్ బాధితుల కోసం సి.ఎం. సహాయ నిధికి అందించిన సహృదయుడు ఆయన. అంతేకాదు, 1972లో స్వాతంత్య్ర సమర యోధుల పెన్షన్ తీసుకోవటానికి కూడా ఆయన నిరాకరించారు. ‘మేము స్వాతంత్య్రం కోసం పోరాడాము. పెన్షన్ కోసం కాదు’ అని ప్రకటించారు. అందుకనే ఆయనను, పార్టీలకతీతంగా గౌరవిస్తారు. ప్రజలందరూ ప్రేమిస్తారు. కానీ అమెరికన్ క్రిస్టియన్ కాలేజీ వారు, పూర్వ విద్యార్థిగా ఉన్న శంకరయ్య గారికి గౌరవ డాక్టరేట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తే, బీజేపీ గవర్నర్ దానిని తొక్కిపట్టారని చెబుతున్నారు. ఇది వారి అల్పత్వానికి నిదర్శనమే కాని ఆయనకున్న విలువను ఏ మాత్రమూ తగ్గించలేదు. ఏదిఏమైనా అశేష ప్రజల ఆదరాభిమానాలను పొందిన నిస్వార్థ జీవితాన్ని గడిపిన శంకరయ్య అమరుడు. కమ్యూనిస్టు ఉద్యమం తీర్చిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శనీయం.