నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్నికల ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఎవరూ ప్రభుత్వ అధికారిక వాహనాలను వినియోగించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులకు కూడా ఇవి వర్తిస్తాయని స్పష్టం చేశారు. అలాంటి ఫిర్యాదులు ఏవైనా తమ దృష్టికి వస్తే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాము అనుమతించిన వాహనాలకంటే ఎక్కువ వినియోగిస్తే వాటిని సీజ్ చేస్తామని చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లన్నీ వేగంగా జరుగుతున్నాయనీ, 74 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ యంత్రాలను రాండమ్‌గా తనిఖీలు చేస్తున్నామన్నారు. సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు 22,254 అనుమతులు ఇచ్చామనీ, సీ-విజిల్ ద్వారా 5,183 ఫిర్యాదుల అందాయని తెలిపారు. తనిఖీల్లో రూ.214 కోట్ల నగదు పట్టుబడిందన్నారు. ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్ల జాబితాకు అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఒక్కో పార్టీకి 40 మంది, బీఆర్‌ఎస్ 39, సీపీఐ(ఎం) 36 మందికి చొప్పున స్టార్ క్యాంపెయినర్లకు అనుమతి ఇచ్చామన్నారు. జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా 8 మందికి అనుమతి ఇచ్చారు. మరికొన్ని పార్టీలకు కూడా ఈ అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు.