ఓటుఓటనంటు నీటుగా వస్తారు
మాటలెన్నొ జెప్పి మాయ జేయ
ఆశలెన్నొజూపి అందల మెక్కింత్రు
ఒక్క చూపు చూడు ఓటరన్న
కాస్ట్ పేస్టు పూసి కంగారు పెడతారు
హార్టు సీటు పెంచి స్మార్టు గాను
మతము పేరుచెప్పి మర్యాద చేస్తారు
ఒక్క చూపు చూడు ఓటరన్న
కొత్త నోట్లతోడ పుత్తడి తోడను
చెత్త కాగితముగ చేతురయ్య
డబ్బుకు ఆశపడక దక్షున్ని గెలిపించు
ఒక్క చూపు చూడు ఓటరన్న
బ్రాంది బాటిలిచ్చి భ్రాంతిలో పడవేసి
దండుకుందురోట్లు దండిగాను
తాగి చెడుకు నీవు తత్త్వంబు తెలుసుకో
ఒక్క చూపు చూడు ఓటరన్న
ఓట్లుకొన్నవాడు ఒడుపైన వ్యాపారి
పెట్టుబడిని పెట్టి పొట్టకొట్టు
అమ్మవంటి ఓటు అమ్మిన ముప్పురా
ఒక్కచూపు చూడు ఓటరన్న
చెప్పనలవికాని తిప్పలెన్నొ పడుచు
మాయజేతురయ్యమంత్రమేసి
చెడ్డవాని గెలుపు చేటురా జాతికి
ఒక్క చూపు చూడు ఓటరన్న
రావణుండు నేడు రామున్ని అంటాడు
సేవ పేరు చెప్పి షేవు(ూష్ట్రaఙవ) చేయు
ఓట్లకొరకు వారు ఫీట్లెన్నొ చేస్తారు
ఒక్క చూపు చూడు ఓటరన్న
దేశ ప్రగతి కొరకె దివ్యమైన ఓటు
ఉన్నవారిలోన ఉత్తమున్ని
ఎన్ను కొనుము మనల నేలుకొనగ
మేలుకొలుము భావి మేలుకోండి
– డా.ఎన్.వి.ఎన్.చారి