ఎన్నాళ్లీ తన్లాట?

– రైతుల గోస తీరాలంటే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలి
– దేశంలో పుష్కలంగా వనరులున్నా వాడుకొనే తెలివి లేదు
– దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది?
– నాందేడ్‌ శిక్షణా తరగతుల్లో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గిట్టుబాటు ధరలు, వ్యవసాయరంగ సమస్యల పరిష్కారం కోసం దేశంలో రైతాంగం ఇంకెంతకాలం తన్లాడాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నాయనీ, వాటిని వినియోగిం చుకొనే తెలివి కేంద్రంలోని ప్రభుత్వాలకు లేదని విమర్శించారు. దేశాన్ని దశాబ్దాలపాటు కాంగ్రెస్‌ పరిపాలించిందనీ, రైతాంగ సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ ఏనాడూ చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల రెండ్రోజుల శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి, రాజకీయ అజ్ఞానులు ఏదేదో మాట్లాడుతున్నారనీ, దేశంలో దశాబ్దాలుగా కాంగ్రెస్‌పార్టీ గెలిచి, సాధించింది ఏంటని ప్రశ్నించారు. 75 ఏండ్లుగా దేశ రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ఎవరూ చిత్తశుద్ధి చూపలేదన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదనీ, ప్రజలు గెలవాలని చెప్పారు. దేశానికి తెలంగాణ మోడల్‌ పాలన అవసరమన్నారు. పుష్కలంగా ఉన్న ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించలేకపోతున్నారని విమర్శించారు. ఓవైపు సాగుకు నీరులేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరోవైపు ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నదని అన్నారు. అకోలా, ఔరంగాబాద్‌లో వారానికోసారి తాగునీరు ఇస్తున్నారనీ, దాదాపు దేశం మొత్తం ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన రైతు ఉద్యమాలు జరిగాయనీ, అనేక ఆందోళనల్లో ఎందరో రైతులు ప్రభుత్వ తూటాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులంటే కేంద్రంలోని ప్రభుత్వానికి గౌరవం లేదనీ, వారు నిత్యం పోరాడుతూనే ఉంటున్నారని అన్నారు. ఈ పరిస్థితులు మారాలని ఆకాంక్షించారు. అప్పటి వరకు బీఆర్‌ఎస్‌ రైతుల పక్షాన పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు. కష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. స్వరాష్ట్రం సిద్ధించాక స్వల్పకాలంలోనే అనేకరంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. మహారాష్ట్రలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వచ్చే దుస్థితి ఉందని ఎద్దేవా చేశారు. కర్నాటకలో బీజేపీ విద్వేష రాజకీయాలు చేసి, ఘోర పరాజయాన్ని చవిచూసిందనీ, అక్కడి ఫలితాల చూసి, కొందరు ఏదేదో మాట్లాడుతున్నారనీ, వారి కలలు నెరవేరబోవని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.