విన్నర్‌ జకోవిచ్‌ ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ సొంతం

The winner is Djokovic Owned the ATP Finals titleట్యురిన్‌ (ఇటలీ) : ప్రపంచ టెన్నిస్‌లో సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ (36) ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సహా 40వ మాస్టర్స్‌ 100 ట్రోఫీ సాధించిన జకోవిచ్‌.. మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటలీలోని ట్యురిన్‌లో జరిగిన ఏటీపీ ఫైనల్స్‌లో నొవాక్‌ జకోవిచ్‌ విజయం సాధించాడు. లోకల్‌ హీరో, ఇటలీ స్టార్‌ జానిక్‌ సిన్నర్‌పై వరుస సెట్లలో అలవోక విజయం నమోదు చేశాడు. 6-3, 6-3తో సిన్నర్‌ను చిత్తు చేసిన జకోవిచ్‌ రికార్డు ఏడో ఏటీపీ ఫైనల్స్‌ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. ‘గత కొన్ని రోజులుగా నా ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. అల్కారాస్‌, సిన్నర్‌పై సాధించిన విజయాలు అమోఘం. ఈ ఇద్దరు భవిష్యత్‌లో ఉత్తమ ఆటగాళ్లు కాగలరు’ అని జకోవిచ్‌ అన్నాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 400వ వారం వరల్డ్‌ నం.1గా నిలిచి దిగ్గజ రోజర్‌ ఫెడరర్‌ రికార్డును జకోవిచ్‌ అధిగమించారు.