తొమ్మిదిన్నరేండ్లలో 1.60 లక్షల కొలువులు

తొమ్మిదిన్నరేండ్లలో 1.60 లక్షల కొలువులు– ఉద్యోగాల భర్తీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
– యువతను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు
– వెబ్‌సైట్‌ను ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తొమ్మిదిన్నరేండ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి 1.60 లక్షల కొలువులు ఇచ్చామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారిక వివరాలతో కూడిన వెబ్‌సైట్‌ను ఆయన మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో గత పదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించారు. తాము ఇచ్చిన లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కన్నా రెట్టింపుకు పైగా ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. సోమవారం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంసిద్ధం అవుతున్న యువకులతో సుదీర్ఘంగా కేటీఆర్‌ చర్చించిన విషయం తెలిసిందే. వారి విజ్ఞప్తి మేరకు ప్రజలకు ముఖ్యంగా యువకులకు అందుబాటులో ఉండేలా ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా పలు రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల యువతలో పలు అపోహలు నెలకొన్నాయని కేటీఆర్‌ దృష్టికి యువకులు తీసుకొచ్చారు. ఆ చర్చ సందర్భంగా వారికి ప్రభుత్వ అధికారిక లెక్కలతో కూడిన వివరాలను కేటీఆర్‌ వివరించారు. ఆ సమాచారం పట్ల యువకులు సంతృప్తి, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాటన్నింటినీ రాష్ట్ర యువతకు అందుబాటులో ఉంచాలని కేటీఆర్‌ను కోరారు. అందుకే వెబ్‌సైట్‌లో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలతోపాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయడం, విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ కోసం మరిన్ని స్టడీ సర్కిళ్ల ఏర్పాటు వంటి అంశాలపైన వివరాలు అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి, యువతీ యువకులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కేటీఆర్‌ కోరారు. షషష.్‌వశ్రీaఅస్త్రaఅajశీbర్‌a్‌ర.ఱఅ వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు ఉంచినట్లు ఆయన తెలిపారు.