– ముస్తాబాద్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ – ముస్తాబాద్/ దౌల్తాబాద్
”కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో ఆగమాగం చేస్తున్నాయి. ఓటర్లూ.. ఆగం కాకండి. కాంగ్రెస్ 50సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగింది? రాష్ట్రంలో 11సార్లు గెలిపించింది చాలదన్నట్టు మళ్లీ ఒకసారి గెలిపించండని కోరుతున్నారు.. జాగ్రత్త” అంటూ సిరిసిల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు, 24 గంటల కరెంటు, ధరణి వంటివి ప్రశ్నార్థకం అవుతాయన్నారు.
తమ హయాంలో కడుపునిండా సంక్షేమ పథకాలు ఇవ్వనోళ్లు ఇప్పుడు ఎలా ఇస్తారో ఆలోచించాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ హయాంలో ఎట్లుండె, ఇప్పుడు ఎట్లయింది అన్నది మీ కండ్ల ముందే ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ చెప్పే కల్లబొల్లి కబుర్లు, మాయమాటలు నమ్మొద్దని సూచించారు. గ్యాస్ సిలిండరుపై మోడీ మోపిన రూ.800 భారాన్ని కేసీఆర్ సర్కారు భరించి రూ.400కే ఇస్తాదని భరోసా ఇచ్చారు. కులం, మతం పేరిట రెచ్చగొట్టే పార్టీలను నమ్మొద్దని చెప్పారు.
సిరిసిల్ల ప్రాంతంలో ముఖ్యమైన నర్మాల ప్రాజెక్టును గోదావరి జలాలతో నింపి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. ముస్తాబాద్ పెద్ద చెరువుకు జీవకళ తెచ్చామని చెప్పారు. ముస్తాబాద్‌కు డిగ్రీ కళాశాల వచ్చే జనవరికల్లా మంజూరు చేస్తామని ప్రకటించారు. 30 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. డిసెంబర్ తర్వాత 18ఏండ్లు దాటిన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం, ఆసరా పింఛన్ల పెంపు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్ గాంధీకి, బీజేపీకి ఓటు వేస్తే మోడీకి పోతుందంటూ, ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కత్తిపోటుకు.. ఓటుతో సమాధానం
కత్తిపోట్ల రాజకీయాలకు ఓటు పోటుతో సమాధానం చెబుతామని మంత్రి కల్వకుంట్ల తారకరామరావు అన్నారు. దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లుచ్చామాటలతో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్‌రావుకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పి ఇంటికి పంపాలన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని, మరోసారి నమ్మితే రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు.
ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కత్తిపోటుకు గురై పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారని, ప్రజలు ఓట్ల పోటుతో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడంతోపాటు దుబ్బాకను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.