బీజేపీ ఎమ్మెల్యే ఆస్తులు 100 కోట్లకుపైనే

బీజేపీ ఎమ్మెల్యే ఆస్తులు 100 కోట్లకుపైనే– రెండో స్థానంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజస్థాన్‌ ఎన్నికల బరిలో సంపన్నులు . ఏడీఆర్‌
రాజకీయాల్లో ప్రజాసేవ చేసే రోజులు గతించాయి. కరెన్సీ ఇచ్చి ఓటు తీసుకున్నాక..ఎంత పోగేసుకున్నామన్న యావ తప్ప గెలిచిన అభ్యర్థులకు ఇంకేం ఉండటంలేదు. అందువల్లే అధికారంలో ఉండగానే.. కోట్లకుకోట్లు కుమ్మేస్తున్నారు. భారీ సంపదను జమ చేసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వద్ద కోట్ల సంపద ఉన్నట్టు…వారు దాఖలు చేసిన అఫిడవిట్‌ లో ప్రస్తావించిన వివరాలను ఏడీఆర్‌ వెల్లడించింది.
భారతీయ ఆదివాసీ పార్టీ ఐదేండ్లలో బీఏపీ ఎమ్మెల్యే సగటు సంపద రూ.1.16 కోట్లు పెరిగింది.
2018లో ఎమ్మెల్యే ఆస్తుల విలువ రూ.1.22 లక్షలు కాగా, అది 2023లో రూ.1.17 కోట్లకు పెరిగింది. మొత్తంమీద, మళ్లీ పోటీ చేస్తున్న 173 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తులు ఐదేండ్లలో రూ.2.86 కోట్లు లేదా 40 శాతం పెరిగాయి. 2018లో ఎమ్మెల్యేల ఆస్తులు రూ.7.10 కోట్లు కాగా, 2023 నాటికి రూ.9.97 కోట్లకు పెరిగాయి.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గత ఐదేండ్లలో రాజస్థాన్‌లో ”గౌరవనీయ” ఎమ్మెల్యేల సంపద భారీగా పెరిగింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ ఇటీవలి నివేదికలో దావా చేసింది. ఇందులో కాంగ్రెస్‌ నుంచి అత్యధికంగా 99 మంది, బీజేపీ నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడీఆర్‌ నివేదికలో ఏమి క్లెయిమ్‌ చేసిదంటే….
161 మంది ఎమ్మెల్యేల సంపద 1శాతం-1999 శాతం పెరిగింది. వాస్త వానికి, 2023 రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్న 173 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్‌లను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌, రాజస్థాన్‌ ఎలక్షన్‌ వాచ్‌ విశ్లేషించాయి. ఇందులో 173 మంది ఎమ్మెల్యేలలో 161 మంది ఎమ్మెల్యేల ఆస్తులు అంటే 93 శాతం ఎమ్మెల్యేల ఆస్తులు 1శాతం నుంచి 1999 శాతానికి పెరిగాయని, 13 మంది ఎమ్మెల్యేలు అంటే 7 శాతం మంది ఎమ్మెల్యేల ఆస్తులు 1 శాతం నుంచి తగ్గాయని తేలింది.
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టాప్‌ 5 ఎమ్మెల్యేల ఆస్తుల్లో అత్యధిక పెరుగుదల (రూపాయిల్లో)
బీజేపీ ఎమ్మెల్యే, బికనీర్‌ ఈస్ట్‌ నియోజకవర్గం అభ్యర్థి సిద్ధి కుమారి తన సంపద రూ.97.61 కోట్లు పెరిగిందని, అంటే 2018లో రూ.4.66 కోట్లుగా ఉన్న తన సంపద ఇప్పుడు 2023లో రూ.102.27 కోట్లకు పెరిగిందని ప్రకటించారు.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, అంటా సీటు అభ్యర్థి ప్రమోద్‌ జైన్‌ ఆస్తులు ఐదేండ్లలో రూ.29.17 కోట్లు, 2018లో రూ.27.31 కోట్ల నుంచి 2023లో రూ.56.49 కోట్లకు పెరిగాయి.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, గంగాపూర్‌ సీటు అభ్యర్థి రాంకేష్‌ ఆస్తులు రూ.23.68 కోట్లు, 2018లో రూ.39.96 కోట్ల నుంచి 2023లో రూ.63.64 కోట్లకు పెరిగాయి.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, నవాల్‌ఘర్‌ సీటు అభ్యర్థి డాక్టర్‌ రాజ్‌కుమార్‌ శర్మ ఆస్తులు రూ.18.62 కోట్లు, 2018లో రూ.9.31 కోట్ల నుంచి 2023లో రూ.18.71 కోట్లకు పెరిగాయి.
చిత్తోర్‌గఢ్‌ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రభాన్‌ సింగ్‌ చౌహాన్‌ సంపద ఐదేండ్లలో రూ.17.94 కోట్లు పెరిగింది. 2018లో ఆయన సంపద రూ.9.51 కోట్లు కాగా, 2023లో రూ.27.46 కోట్లకు పెరిగింది.
పోటీ చేసే ఎమ్మెల్యేల సగటు ఆస్తులు పెంపు
కాంగ్రెస్‌: ఐదేండ్లలో 99 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆస్తులు కోట్లాది రూపాయలు పెరిగాయి. ఏడీఆర్‌ నివేదిక ప్రకారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు 33.41శాతం పెరిగాయి. 2018లో వారి సగటు సంపద రూ.8.41 కోట్లు కాగా, 2023లో రూ.11.22 కోట్లకు పెరిగింది.

బీజేపీ: ఐదేండ్లలో 60 మంది బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు 50.63 శాతం పెరిగాయి. 2018లో రూ.5.70 కోట్లుగా ఉన్న ఎమ్మెల్యేల సగటు సంపద ఇప్పుడు రూ.8.58 కోట్లకు పెరిగింది.
ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా..
స్వతంత్రులు: ఆస్తుల పెంపు విషయంలో స్వతంత్రులు కూడా వెనుకంజ వేయలేదు. ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల ఆస్తులు 86.89 శాతం పెరిగాయి. అంటే 2018లో ఎమ్మెల్యేల ఆస్తులు రూ.5.63 కోట్లు కాగా, 2023 నాటికి రూ.10.53 కోట్లకు పెరిగాయి.
రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ
ముగ్గురు ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 1.79 కోట్లు అంటే 184.12 పెరిగాయి. 2018లో వారి సగటు సంపద రూ.97.50 లక్షలు కాగా, 2023లో రూ.2.77శాతం కోట్లకు పెరిగింది.
శివసేన: శివసేన ఎమ్మెల్యే సగటు సంపద 346% పెరిగింది అంటే రూ.3.3 కోట్లు. 2018లో ఎమ్మెల్యేల సగటు సంపద రూ.95 లక్షలు కాగా, అది 2023లో రూ.4.26 కోట్లకు పెరిగింది.
ఐదేండ్లలో ఆర్‌ఎల్డీ ఎమ్మెల్యే సగటు సంపద రూ. 1.34 కోట్లు లేదా 52.7 శాతం పెరిగింది. ఎమ్మెల్యే ఆస్తులు 2018లో రూ.2.55 కోట్లు కాగా, 2023లో రూ.3.89 కోట్లకు పెరిగాయి. రాష్ట్రీయ జనతా సేన: ఆర్జేఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఐదేళ్లలో తన సంపదను అనేక కోట్లు పెంచుకున్నాడు. 2018లో ఎమ్మెల్యే సగటు ఆస్తి రూ.13.08 కోట్లు కాగా, 2023లో రూ.17.04 కోట్లకు పెరిగింది. మొత్తంమీద ఐదేండ్లలో ఎమ్మెల్యేల సగటు సంపద రూ.3.95 కోట్లు అంటే 30.22% పెరిగింది.
– 2018 ఎన్నికల్లో సగటు ఆస్తులు: 2018లో స్వతంత్రులతో సహా వివిధ పార్టీల ద్వారా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ 173 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తులు 7.10 కోట్లు.
– 2023 ఎన్నికల్లో సగటు ఆస్తులు: 2023లో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ 173 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.9.97 కోట్లు.
– 5 సంవత్సరాలలో (2018-2023): 2018 మరియు 2023 రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల మధ్య, తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ 173 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తి వద్ధి రూ.2.86 కోట్లు.
– ఐదేండ్లలో పెరిగిన శాతం (2018-2023): ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ 173 మంది ఎమ్మెల్యేల ఆస్తుల సగటు పెరుగుదల 40శాతం.