ఊపిరితిత్తుల వ్యాధులపై జాతీయ సదస్సు

ఊపిరితిత్తుల వ్యాధులపై జాతీయ సదస్సు– నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 3 వరకు నిర్వహణ : ఐసీఎస్‌, ఎన్‌సీసీపీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ (ఐసీఎస్‌), నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఛాతీ వైద్యుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 3 వరకు ఊపిరితిత్తుల వ్యాధులపై వార్షిక జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్‌ కాలేజీ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.నరేందర్‌ తదితరులు సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 2,500 మంది పాల్గొంటారని తెలిపారు. శ్వాసకోశ వ్యాధుల నిర్ధారణ, నివారణ, నిర్వహణ, చికిత్సలో తాజా పురోగతులపై పరస్పరం అవగాహన పెంచుకోవడం సదస్సు లక్ష్యమని చెప్పారు. శాస్త్రీయ ఎజెండాలో వంద సెషన్లు ఉంటాయనీ, వీటికి 60 మంది అంతర్జాతీయ, 460 మంది జాతీయ అధ్యాపకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వైద్య కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి. శ్రీనివాస్‌, కన్సల్టెంట్‌ పల్మోనాలజిస్ట్‌ డాక్టర్‌ ఎం.రాజీవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్‌ టీంలో చైర్మెన్‌ డాక్టర్‌ ఎం.విజయకుమార్‌, కార్యదర్శి డాక్టర్‌ శుభాకర్‌ కంది, కోశాధికారి డాక్టర్‌ ఎం.నరేందర్‌ తదితరులున్నారు.